మంగళవారం 14 జూలై 2020
National - Jun 30, 2020 , 17:18:15

దేశాల మధ్యే ఉద్రిక్తత.. పౌరుల మధ్య కొనసాగుతున్న ప్రేమ!

దేశాల మధ్యే ఉద్రిక్తత.. పౌరుల మధ్య కొనసాగుతున్న ప్రేమ!

అహ్మదాబాద్‌: భారతీయులకు, భారత ప్రభుత్వానికి చైనీస్ పౌరులతో సమస్యలు లేవు. ఆ ప్రజాస్వామ్యేతర ప్రభుత్వం, వారి దురాగతాలతోనే సమస్య. దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది అహ్మదాబాద్‌లోని చంద్‌ఖేడలో నివసిస్తున్న చైనా వ్యక్తి మా హై గువో జీవన విధానం. గాల్వన్‌ వ్యాలీ నేపథ్యంలో భారత్‌, చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా ఇక్కడి అమ్దావాడి సొసైటీ సభ్యులు చైనా వ్యక్తిపై ఎప్పటిలాగే స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. ఆదరణలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు.

మా హై గువో (30) చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌కు చెందినవాడు. అతడు 2016 డిసెంబర్‌లో అహ్మదాబాద్‌లోని చంద్‌ఖేడకు చెందిన పల్లవి గౌతమ్ (38)ను వివాహం చేసుకున్నాడు. ‘మాహి’ అనే భారతీయ పేరును స్వీకరించాడు. మా, జనవరి నుంచి గౌతమ్‌తో కలిసి తన చంద్‌ఖేడా ఫ్లాట్‌లో నివసిస్తున్నాడు. జూన్ 16న గాల్వన్ వ్యాలీ ఘటన తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. కానీ వారి హౌసింగ్ సొసైటీ సభ్యులు అతడితో ఎప్పటిలాగే స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. ప్రేమను చూపుతున్నారు.  ‘మాహి మా అల్లుడు, అతడికి ఎప్పటికీ రక్షణగా ఉంటాం.. అతడికి సేవ చేస్తాం.’ అని సొసైటీ సభ్యులు పేర్కొంటున్నారు. 

మా 2015లో అహ్మదాబాద్‌లో చైనా సెల్‌ఫోన్ కంపెనీ ఉద్యోగిగా పర్యటించినప్పుడు అతడికి పల్లవిగౌతమ్‌ అనువాదకురాలిగా పనిచేసింది. వారిద్దరి మధ్య ప్రేమ చిగురించడంతో తర్వాత ఏడాది బౌద్ధ ఆచారాల ప్రకారం వివాహం చేసుకున్నారు. అనంతరం ఆ జంట సిచువాన్‌ ప్రావిన్స్‌కు వెళ్లింది.  చైనాలో కరోనావైరస్ వేగంగా వ్యాప్తి చెందడం ప్రారంభించినప్పుడు, జనవరిలో తిరిగి అహ్మదాబాద్‌కు చేరుకున్నారు. కొవిడ్ పరిస్థితి సాధారణీకరించబోతున్న తరుణంలో, గాల్వన్ ప్రతిష్టంభన ఏర్పడింది. ‘కానీ రెండు సంక్షోభాల సమయంలో, నా కుటుంబం, సమాజ సభ్యులు నాకు నా భర్తకు సహకరించారు. ఇక్కడ నగరంలో శాంతియుతంగా జీవించడానికి సహాయపడ్డారు.’ అని పల్లవి గౌతమ్‌ పేర్కొన్నారు. ‘సొసైటీ సభ్యులు మా తో కమ్యూనికేట్ అయ్యేందుకు ఆన్‌లైన్ అనువాద సాధనాలను ఉపయోగిస్తారు. చాలామంది అతడితో కలిసి ప్రయాణించడానికి ఇష్టపడుతారు. సొసైటీలోని పిల్లలతో అతడు ఆడుకుంటాడు. అలాగే, ఆసక్తి ఉన్నవారికి మాండరిన్ కూడా నేర్పిస్తాడు.’ అని ఆమె వివరించారు. ‘మా’ మంచి స్వభావం గలవాడని, స్నేహశీలి అని ఈ జంట పక్క ఫ్లాట్‌లో ఉంటున్న అపూర్వ పర్మార్‌ పేర్కొన్నారు.  logo