శుక్రవారం 04 డిసెంబర్ 2020
National - Oct 27, 2020 , 15:08:49

దుర్గమ్మ విగ్రహాల నిమజ్జనంలో ఘర్షణ : కాల్పుల్లో ఒకరు మృతి

దుర్గమ్మ విగ్రహాల నిమజ్జనంలో ఘర్షణ : కాల్పుల్లో ఒకరు మృతి

పాట్నా : బిహార్ రాష్ట్రంలోని ముంగేర్ పట్టణంలో దుర్గా మాత విగ్రహాల నిమజ్జనంలో ఘర్షణ చోటుచేసుకున్నది. సోమవారం అర్ధరాత్రి పోలీసులు-నిమజ్జనకారుల మధ్య జరిగిన ఘర్షణ కారణంగా పోలీసులు కాల్పులు జరుపడంతో ఒకరు మృతిచెందగా.. 20 మంది పోలీసులతోపాటు 27 మంది గాయపడ్డారు. ఘర్షణలో కొంతమంది బయటి వ్యక్తులు తుపాకులను ఉపయోగించారని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఈ గుంపు రాళ్ళతో కొట్టి పోలీసులపై కాల్పులు జరుపడంతో ఒక వ్యక్తి మరణానికి దారితీసిందని పోలీసులు అంటున్నారు. 

ముంగేర్‌ పట్టణంలో దుర్గా మాత విగ్రహాలను నిమజ్జనం చేయడంలో స్థానికులు, పోలీసు సిబ్బంది మధ్య జరిగిన వాదన హింసాకాండకు దారితీసింది. వీరిని నియంత్రించేందుకు పోలీసులు కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పోలీసులు మొదట్లో టియర్ గ్యాస్ షెల్స్‌ను ఉపయోగించారు. ఈ ఘర్షణలో 20 మంది పోలీసులతోపాటు మొత్తం 27 మంది గాయపడ్డానని ముంగెర్ ఏఎస్సీ లిపిసింగ్ చెప్పారు. ముంగేర్‌లో 53 కి పైగా దుర్గా మాత విగ్రహాలను ఏర్పాటు చేసినట్లు దుర్గా మాత విగ్రహాల నిమజ్జనం కమిటీ సభ్యుడు ప్రకాష్ భగత్ తెలిపారు. సాంప్రదాయకంగా విజయదశమి అనంతరం మూడు రోజుల తర్వాత విగ్రహాలను నిమజ్జనం చేస్తారు. అయితే ఈసారి అసెంబ్లీ ఎన్నికల మొదటి దశను దృష్టిలో ఉంచుకుని మంగళవారం తెల్లవారుజామున 5 గంటలకు నిమజ్జనం చేయాలని అధికారులు పట్టుబట్టారు. 

దుర్గా పూజ నిర్వాహకులు నిమజ్జనానికి వెళ్లేటప్పుడు అర్ధరాత్రి డీజేలు పెట్టి సంగీతం వినిపిస్తూ బయలుదేరారు. రాత్రి 11.50 గంటల సమయంలో విగ్రహాలను మోస్తున్న నలుగురిని పోలీసు అధికారులు భుజాలపై కొట్టడంతో పరిస్థితి అధ్వాన్నంగా మారింది. పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఊరేగింపుదారులు, పూజా నిర్వాహకులు నిరసనకు దిగారు. ఈ గుంపు పోలీసులపై రాళ్ళు రువ్వడం ప్రారంభించింది. దాంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పి గుంపును చెదరగొట్టడానికి ప్రయత్నించారు. అలాగే టియర్ గ్యాస్ షెల్స్‌ను ఉపయోగించారని, 15 రౌండ్లు గాలిలో కాల్చారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. తలపై తూటా తగలడంతో అనురాగ్ కుమార్ మరణించాడని మృతుడి బంధువు సాధనా కుమార్ తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.