శుక్రవారం 27 నవంబర్ 2020
National - Nov 15, 2020 , 10:04:56

కశ్మీర్‌లో డీడీసీ ఎన్నికలకు ముందు పీడీపీకి ఎదురుదెబ్బ..

కశ్మీర్‌లో డీడీసీ ఎన్నికలకు ముందు పీడీపీకి ఎదురుదెబ్బ..

శ్రీనగర్‌ : జమ్ముకశ్మీర్‌లో డిస్ట్రిక్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ (డీడీసీ) ఎన్నికలకు ముందు మెహబూబా ముఫ్తీ నేతృత్వంలోని పీపుల్స్‌ డెమొక్రటిక్‌ పార్టీ (పీడీపీకి)  భారీ ఎదురుదెబ్బ తగలింది. ఆ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు, సీనియర్‌ నాయకుడు ముజఫర్‌ హుస్సేన్‌ బేగ్‌ పార్టీని వీడారు.  డీడీసీ ఎన్నికల్లో పీపుల్స్‌ డెమొక్రటిక్‌ పార్టీ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీలు కూటమిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీట్ల కేటాయింపు విషయంలో అధిష్ఠానం తనను సంప్రదించకుండానే నిర్ణయం తీసుకోవడంతో ముజఫర్‌ హుస్సేన్‌ నొచ్చుకున్నారు.

నేషనల్ కాన్ఫరెన్స్‌ నాయకుడు ఫరూక్‌ అబ్దుల్లా ఈ కూటమికి అధ్యక్షత వహిస్తుండగా.. పీడీపీ అధ్యక్షులురాలు మెహబూబా ముఫ్తీ ఉపాధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. జమ్ముకశ్మీర్‌లో డీడీసీ ఎన్నికలు నవంబర్‌ 28 నుంచి డిసెంబర్‌ 19 వరకు ఎనిమిది విడుతల్లో జరగనున్నాయి. డిసెంబర్‌ 22న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను పునరుద్ధరించాలన్న డిమాండ్‌తో ఈ రెండు పార్టీలు పీపుల్స్‌ అలయెన్స్‌ గుప్కార్‌ డిక్లరేషన్ ‌(పీఏజీడీ) పేరుతో కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. ఉమ్మడి కశ్మీర్‌ జెండాను కూటమి గుర్తుగా ఎంచుకున్నారు. ఈ సందర్భంగా ఫరూక్‌ అబ్దుల్లా మాట్లాడుతూ బీజేపీకి మాత్రమే పీఏజీడీ వ్యతిరేకమని, దేశానికి కాదని ప్రకటించిన విషయం విదితమే. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.