బుధవారం 05 ఆగస్టు 2020
National - Jul 09, 2020 , 02:40:51

లక్ష కోట్లతో అగ్రి ఫండ్‌

లక్ష కోట్లతో అగ్రి ఫండ్‌

  • నవంబర్‌ వరకు పీఎం గరీబ్‌ కల్యాణ్‌ యోజన l పట్టణాల్లో తక్కువ కిరాయికే ఇండ్ల పథకం
  • ఆగస్టు వరకు ఈపీఎఫ్‌ కంట్రిబ్యూషన్‌ l కేంద్ర క్యాబినెట్‌ కీలక నిర్ణయాలు
  • వ్యవసాయ మౌలికవసతుల నిధి ఏర్పాటు

న్యూఢిల్లీ, జూలై 8: వ్యవసాయరంగంలో మౌలికవసతుల కల్పనకు ఊతమిచ్చేందుకు ప్రత్యేక నిధిని ఏర్పాటుచేయాలని కేంద్ర క్యాబినెట్‌ నిర్ణయించింది. వ్యవసాయ మౌలికవసతుల నిధి పేరుతో లక్షకోట్ల రూపాయలతో ఈ నిధిని ఏర్పాటుచేస్తారు. మరోవైపు కరోనా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు మరో ఐదు నెలలు ఉచితంగా ఆహారధాన్యలు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రధానమంత్రి గరీబ్‌కల్యాణ్‌ యోజన పథకాన్ని పొడిగించాలని క్యాబినెట్‌ తీర్మానించింది. ప్రధాని నేతృత్వంలో బుధవారం సమావేశమైన కేంద్ర క్యాబినెట్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది. పట్టణ ప్రాంతాల్లో పేదలకు తక్కువ రెంటుకే అద్దె ఇండ్లు అందుబాటులోకి తెచ్చేందుకు ఏఆర్‌హెచ్‌సీ పథకం అమలుచేయాలని క్యాబినెట్‌ నిర్ణయించింది. ఈ పథకం ఎంతో మంది జీవితాలను మార్చనున్నదని సమావేశం అనంతరం ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు.

వ్యవసాయానికి దన్ను

కరోనా లాక్‌డౌన్‌ కారణంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను గాడిలోపెట్టేందుకు రూ.20లక్షల కోట్లతో ఆత్మనిర్బర్‌ ప్యాకేజీ ప్రకటించిన కేంద్రం, అందులో వ్యవసాయరంగానికి కూడా పలు ఉద్దీపనలు ఇచ్చింది. దాంట్లో భాగంగా రూ.లక్ష కోట్లతో మౌలిక వసతుల నిధి ఏర్పాటుకు క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. 2029 వరకు కొనసాగే ఈ నిధి ద్వారా వ్యవసాయ అనుబంధ సంస్థలకు మధ్య దీర్ఘకాలిక లోన్లు ఇస్తారు. ప్రాథమిక వ్యవసాయ రుణ సంస్థలు, రైతు సంఘాలు, రైతు ఉత్పత్తుల సమాఖ్యలు (ఎఫ్‌పీవో), వ్యవసాయ సంబంధ కంపెనీలు, అంకుర సంస్థలు, వ్యవసాయ సాంకేతిక సంస్థలకు ఈ నిధినుంచి రుణాల రూపంలో ఆర్థిక సహకారం అందిస్తారు. ఈ ఏడాది రూ.10వేల కోట్లు, వచ్చే ఏడాదినుంచి వరుసగా మూడేండ్లు ఏటా రూ.30 వేలకోట్లు లోన్లుగా ఇవ్వాలని నిర్ణయించారు. శీతల గిడ్డంగులు, వేర్‌హౌజుల స్థాపనకు కూడా లోన్లు ఇస్తారు. 

మరికొన్ని క్యాబినెట్‌ నిర్ణయాలు

  • కరోనా కారణంగా ఉపాధి కోల్పోయి ఆకలితో అలమటిస్తున్న పేదలకు ఉచితంగా బియ్యం, గోధుమలు, పప్పు అందించే పీఎం గరీబ్‌కల్యాణ్‌ యోజన పథకం వచ్చే నవంబర్‌ వరకు పొడిగింపు.
  • పట్టణప్రాంత పేద, మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరల్లో అద్దె ఇండ్లు అందించే ఆఫర్డబుల్‌ రెంటల్‌ హౌజింగ్‌ కాంప్లెక్సెస్‌ (ఏఆర్‌హెచ్‌సీ) పథకానికి ఆమోదం.
  • ఉద్యోగుల భవిష్యనిధి (పీఎఫ్‌)కు మూడు నెలలపాటు చందా చెల్లించే పథకానికి క్యాబినెట్‌ ఆమోదం. ఆగస్టువరకు ఎంప్లాయర్‌, ఎంప్లాయీ ఈపీఎఫ్‌ చందాను కేంద్రం జమచేస్తుంది.
  • పేద మహిళలకు ఉజ్వల పథకం కింద ఉచితంగా ఇచ్చే వంటగ్యాస్‌ పథకం.. సెప్టెంబర్‌ వరకు పొడిగింపు.


logo