శుక్రవారం 03 జూలై 2020
National - Apr 27, 2020 , 12:23:23

జనం మీదకు ఆహార పొట్లాలు విసిరేస్తున్నారు

జనం మీదకు ఆహార పొట్లాలు విసిరేస్తున్నారు

హైదరాబాద్: ఉత్తరప్రదేశ్‌లోని ఓ కంటైన్మెంట్ సెంటర్‌లో క్వారంటైన్‍లో ఉన్న జనాలపైకి ఆహార పొట్లాలు, నీటి సీసాలు విసిరేస్తున్న వీడియోలు నెటిజనుల ఆగ్రహానికి గురవుతుంటే సర్దిచెప్పలేక యూపీ అధికారులు సతమతం అవుతున్నారు. శారదా గ్రూప్ విద్యాసంస్థల భవనాల వద్ద ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. కరోనా వ్యాప్తి నిరోధక చర్య్లల్లో భాగంగా ఆ భవనాలను క్వారంటైన్ కేంద్రాలుగా మార్చారు. గేటుల్లోంచి చేతులు సాచినవారి పైకి నీలిరంగు రక్షక దుస్తులు ధరించిన సిబ్బంది బిస్కెట్ పొట్లాలు విసరడం చూసినవారు మరీ ఇంత అనాగరికమా? అని ముక్కుమీద వేలేసుకుంటున్నారు. ఇది మొదటి వీడియో. గేటు వద్ద పెట్టిన మంచినీటి సీసాల కోసం లోపలున్న వారు గేటు దగ్గర ఎగబడి ఒకరినొకరు తోసుకోవడం రండో వీడియోలో నమోదైంది. 'వేరుచేసి ఉంచామని చెపుతున్న జనాలతో వ్యవహరిస్తున్న తీరు ఇదీ. మాకు వైద్య పరీక్షలు జరుపుతామని అన్నారు. కానీ అలాంటివేవీ జరలేదు. డాక్టర్లు, అధికారులు మమ్మల్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఆహారం, నీరు సరపరాకు తగిన ఏర్పాట్లు లేవు' అని ఓ మహిళ వాపోవడం రండో వీడియోలో రికార్డు అయింది. ఆహార సరఫరా గురించి ఫిర్యాదులు అందిన తర్వాత క్వారంటైన్ సెంటర్‌లో అధికారుల బృందంతో తనిఖీలు నిర్వహించామని జిల్లా మేజిస్ట్రేటు ప్రభు ఎన్. సింగ్ తెలిపారు. పరిస్థితిని పరిశీలించి బాధ్యులను గుర్తించాలని ఆ బృందాన్ని ఆదేశించామని వివరించారు. సేవల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు హెచ్చరికలు వెళ్లాయని అన్నారు. ప్రేమ చిహ్నమైన తాజ్‌మహల్ నెలకొన్న జిల్లాలో కరోనా నియంత్రణకు చేపట్టిన చర్యలను మొదట్లో అంతా 'ఆగ్రా నమూనా' అని మెచ్చుకున్నారు. ఇప్పుడు అదే ఆగ్రా జిల్లాలో కరోనా కేసులు యూపీలోనే అత్యధికంగా 372 నమోదు కావడం గమనార్హం. 'చూశారా, ఆగ్రా మోడల్ కాస్తా ఇప్పుడు ఇండియా వూహాన్‌గా మారుతున్నది. క్వారంటైన్ కేంద్రాల్లో మనుషులను పశువుల్లాగా చూస్తున్నారు. దేనికి నమూనా ఈ నగరం? అనేది ఎవరికి వారే ఊహించుకోవచ్చు' అని కాంగ్రెస్ నాయకుడు అఖిలేశ్ ప్రతాప్‌సింగ్ ట్విట్టర్‌లో విమర్శించారు.


logo