సోమవారం 30 నవంబర్ 2020
National - Oct 31, 2020 , 15:09:17

నిన్న పంజాబ్.. ఇవాళ రాజస్థాన్.. కేంద్రానికి వ్యతిరేకంగా కొత్త అగ్రి బిల్లులు

నిన్న పంజాబ్.. ఇవాళ రాజస్థాన్.. కేంద్రానికి వ్యతిరేకంగా కొత్త అగ్రి బిల్లులు

జైపూర్ : ఇటీవల కేంద్రం రూపొందించిన వ్యవసాయ చట్టాల ప్రభావాన్ని తిరస్కరించడానికి రాజస్థాన్ ప్రభుత్వం శనివారం మూడు బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఈ నెల ప్రారంభంలో పంజాబ్ అసెంబ్లీ కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా నాలుగు బిల్లులను ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదించిన తరువాత.. ఇప్పుడు రాజస్థాన్‌ వంతు వచ్చింది. కేంద్ర చట్టాలను ఎదుర్కోవటానికి అధికారంలో ఉన్న రాష్ట్రాలు తమ సొంత చట్టాలను ఆమోదించాలని కాంగ్రెస్ నాయకత్వం సూచించడంతో పంజాబ్‌, రాజస్థాన్‌ ప్రభుత్వాలు కొత్త బిల్లులను తీసుకొచ్చాయి.

ఎసెన్షియల్ కమోడిటీస్ (స్పెషల్ ప్రొవిజన్స్ అండ్ రాజస్థాన్ సవరణ) బిల్లు 2020, రైతుల (సాధికారత మరియు రక్షణ) ధరల భరోసా, వ్యవసాయ సేవల ఒప్పందం (రాజస్థాన్ సవరణ) బిల్లు 2020, రైతుల ఉత్పత్తి వర్తక, వాణిజ్యం (ప్రమోషన్ మరియు సౌకర్యం మరియు రాజస్థాన్ సవరణ) బిల్లు 2020 లను రాజస్థాన్ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి శాంతి ధారివాల్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అసెంబ్లీ సమావేశాల మొదటి రోజున కోడ్ ఆఫ్ ప్రొసీజర్ (రాజస్థాన్ సవరణ) బిల్లు 2020 ను ప్రవేశపెట్టారు. అనంతరం ఇటీవల కన్నుమూసిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీతోపాటు పలువురు నాయకుల మృతికి సంతాపం ప్రకటించి సభను రేపటికి వాయిదా వేశారు. 

"రైతు వ్యతిరేక చట్టాలను" దాటవేయడంలో తమ రాష్ట్రం పంజాబ్‌ను అనుసరిస్తుందని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ చెప్పారు. సోనియాగాంధీ ఆదేశాల మేరకు ఈ కొత్త బిల్లులు ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం ఆమోదించిన రైతు వ్యతిరేక చట్టాలు తమకు ఎంతమాత్రమూ ఆమోదయోగ్యం కాదని, కేంద్ర చట్టాలతో చిన్న, మధ్య తరగతి రైతులు కొత్త సమస్యల చట్రంలోకి పోవడం ఖాయమని గెహ్లోట్‌ వ్యాఖ్యానించారు. కేంద్రం చట్టాలకు వ్యతిరేకంగా పంజబ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో రైతులు నిరసన వ్యక్తం చేశారు. కేంద్రం తన కొత్త  చట్టాలను విరమించుకునే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని రైతులు అంటుండగా.. ఈ చట్టాలు రైతుల ఆదాయాన్ని పెంచుతాయని, మధ్యవర్తుల బారి నుంచి విముక్తి పొందుతాయని, వ్యవసాయంలో కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకువస్తాయని కేంద్ర ప్రభుత్వం చెప్తున్నది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.