శుక్రవారం 10 ఏప్రిల్ 2020
National - Mar 25, 2020 , 15:55:45

నిఫా, వ‌ర‌ద‌లు, క‌రోనా.. ఆ జంట‌కు పెళ్లి అయ్యేదెప్పుడో!

నిఫా, వ‌ర‌ద‌లు, క‌రోనా.. ఆ జంట‌కు పెళ్లి అయ్యేదెప్పుడో!

ఓ జంట‌కు క‌ల్యాణ‌ఘ‌డియలు వ‌చ్చిన‌ట్టే వ‌చ్చి వెళ్లిపోతున్నాయి.. ఆ జంట క‌ల్యాణానికి ప్ర‌కృతి కూడా స‌హ‌క‌రించ‌డం లేదు. మొన్న నిఫా వైర‌స్.. నిన్న వ‌ర‌ద‌లు.. నేడు క‌రోనా వైర‌స్.. ఆ జంట‌ పెళ్లికి అడ్డుప‌డ్డాయి. ముహుర్తం పెట్టుకున్న ప్రతిసారి ఏదో ఒక ఆటంకం క‌లుగుతూనే ఉంది. దీంతో ఇప్ప‌టికే ఆ జంట వివాహం ముచ్చ‌ట‌గా మూడుసార్లు వాయిదా ప‌డింది. ఇప్పుడైనా చేసుకుందామంటే క‌రోనా మ‌హమ్మారి అడ్డుప‌డింది. మ‌రి ఆ జంట‌కు పెళ్లి అయ్యేదెప్పుడో!

కేర‌ళలోని కోజికోడ్ కు చెందిన ప్రేమ‌చంద్ర‌న్(26)తో సంద్రా సంతోష్(23) అనే యువ‌తికి వివాహం నిశ్చ‌య‌మైంది. 2018 మే 20న పెళ్లి చేయాల‌ని ఇరు కుటుంబాలు నిర్ణ‌యించారు. అయితే ఆ స‌మ‌యంలో కేర‌ళ‌లో నిఫా వైర‌స్ విజృంభించింది. కోజికోడ్, మ‌ల‌ప్పురం జిల్లాలో 17 మంది చ‌నిపోయారు. ఈ వైర‌స్ ను అరిక‌ట్టే చ‌ర్య‌ల్లో భాగంగా జ‌న స‌మూహ‌ల‌పై ఆంక్ష‌లు విధించారు. సామాజిక దూరం పాటించాల‌ని ఆదేశించారు. దీంతో ప్రేమ‌చంద్ర‌న్, సంద్రా వివాహం వాయిదా ప‌డింది.

నిఫా నుంచి బ‌య‌ట‌ప‌డిన తర్వాత పెళ్లి చేసుకుందామ‌నుకునే స‌రికి.. ప్రేమ‌చంద్ర‌న్ ద‌గ్గ‌రి బంధువు చ‌నిపోయాడు. దీంతో ఏడాది కాలం పాటు మ‌రోసారి పెళ్లి వాయిదా ప‌డింది. 2019 ఏడాదిలో వ‌చ్చే ఓనం సెల‌వుల్లో పెళ్లి పెట్టుకోవాల‌ని పెద్ద‌లు అనుకున్నారు. కానీ ఆ స‌మ‌యానికి కేర‌ళ‌లో వ‌ర‌ద‌లు బీభ‌త్సం సృష్టించాయి. వీరి పెళ్లికి ఈ సారి ప్ర‌కృతి అడ్డుప‌డింది. వ‌ర‌ద‌ల కార‌ణంగా 2019, ఆగ‌స్టులో చేసుకోవాల‌నుకున్న పెళ్లి.. 2020 మార్చి 22కు వాయిదా ప‌డింది.

స‌రిగ్గా ఈ స‌మ‌యానికే క‌రోనా మ‌హ‌మ్మారి చాప‌కింద నీరులా విస్త‌రించింది. క‌రోనా వైర‌స్ ను నియంత్రించేందుకు సామాజిక దూరం పాటించాల‌ని కేంద్రంతో పాటు కేర‌ళ ప్ర‌భుత్వం పిలుపునిచ్చింది. పెళ్లిళ్లు కూడా వాయిదా వేసుకోవాల‌ని విజ్ఞ‌ప్తి చేసింది. దీంతో మ‌రోసారి ప్రేమ‌చంద్ర‌న్ వివాహం వాయిదా ప‌డింది. ఆ జంట ఒక్క‌టైది ఎప్పుడో మ‌రి.. ఏ ఆటంకం లేకుండా వారి వివాహం త్వ‌ర‌లోనే జ‌ర‌గాల‌ని ప్ర‌తి ఒక్క‌రం ఆశిద్దాం.. 


logo