బుధవారం 12 ఆగస్టు 2020
National - Jul 16, 2020 , 19:44:26

40 మంది ఉద్యోగులకు కరోనా.. ‘ఎంటీఆర్‌ ఫుడ్స్‌’ మూసివేత

40 మంది ఉద్యోగులకు కరోనా.. ‘ఎంటీఆర్‌ ఫుడ్స్‌’ మూసివేత

బెంగళూరు: తమ సంస్థలోని 40 మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో ప్రముఖ రెడీ టూ ఈట్‌ ఇన్‌స్టంట్‌ ఫుడ్‌ తయారీదారు ‘ఎంటీఆర్‌ ఫుడ్స్‌’ కంపెనీ కార్యకలాపాలను ఈ నెల 20 వరకు నిలిపేయాలని నిర్ణయించింది. దీంతో కర్ణాటక రాష్ట్రంలోని బొమ్మసాంద్రలో ఈ కంపెనీ ఫ్యాక్టరీ మరికొద్దిరోజులు మూతపడనుంది. ‘జూలై 6 న ఫ్యాక్టరీలో మొట్టమొదటి కరోనా కేసు నమోదైంది. వెంటనే కార్యకలాపాలను నిలిపేసి, మా ప్రాంగణాన్ని శానిటైజ్‌ చేశాం. మా ఉద్యోగుల భద్రత, శ్రేయస్సు మాకు చాలా ముఖ్యం. అందుకే జూలై 20 వరకు మా కంపెనీని మూసివేయాలని నిర్ణయించాం.’ అని  ఆ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

జూలై 7 న ఫ్యాక్టరీ మూసివేసిన తర్వాత, శానిటైజేషన్ ప్రొటోకాల్స్‌ పాటించారు. ప్రైమరీ కాంటాక్ట్‌లను క్వారంటైన్‌ చేశారు. అలాగే, సెకండరీ కాంటాక్ట్‌లను ఐసోలేషన్‌లో ఉంచారు. జూలై 10న ఫ్యాక్టరీ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడానికి ఆరోగ్యశాఖ అధికారులు అనుమతి కూడా ఇచ్చారు. అయితే, ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా తాము మరో పది రోజులు కంపెనీని మూసివేయాలని నిర్ణయించినట్లు యజమానులు తెలిపారు.  అయితే, ఇప్పటికే సూపర్‌మార్కెట్లలో ఉన్న తమ ఉత్పత్తుల గురించి ఆ సంస్థ స్పందిస్తూ.. ఆహారపదార్థాలు, వాటి ప్యాకేజీల ద్వారా కరోనా వైరస్‌ ప్రజలను చేరుకుంటుందని డబ్య్లూహెచ్‌వో పేర్కొనలేదని, అలాగే, తాము ఉత్పత్తులను యంత్రాల సహాయంతో ప్యాకింగ్‌ చేస్తామని, మనుషుల ప్రమేయం ఉండదని పేర్కొంది. బెంగళూరులో వారం రోజుల లాక్‌డౌన్‌ తర్వాత తిరిగి కార్యకలాపాలు ప్రారంభిస్తామని, క్రమంగా కార్యకలాపాలను పెంచుతామని ఎంటీఆర్ తెలిపింది. తమ ఉత్పత్తులన్నీ మార్కెట్లలో లభిస్తూనే ఉంటాయని పేర్కొంది. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo