బుధవారం 03 జూన్ 2020
National - May 13, 2020 , 02:49:41

దేశీ విమానాలకు మళ్లీ రెక్కలు!

దేశీ విమానాలకు మళ్లీ రెక్కలు!

  • 18 నుంచి పునఃప్రారంభమయ్యే అవకాశం
  • మార్గదర్శకాలు సిద్ధంచేసిన విమానయాన శాఖ 
  • ఎయిర్‌పోర్టుకు రెండు గంటల ముందే రావాలి 
  • క్యాబిన్‌లోకి సామాన్లు తేవడం నిషిద్ధం

ముంబై, మే 12: కరోనా నేపథ్యంలో మార్చి 25 నుంచి నిలిచిపోయిన విమానాలు మళ్లీ రెక్కలు విప్పుకోనున్నాయి. ఈ నెల 18 నుంచి వైమానిక సేవలను పునరుద్ధరించేందుకు కేంద్రం సిద్ధమవుతున్నట్టు సమాచారం. కేంద్ర పౌరవిమానయాన శాఖ ఏర్పాటుచేసిన ప్రత్యేక కమిటీ సోమవారం నివేదిక అందజేసింది. ఈ సిఫారసుల మేరకు సోమవారం నుంచి విమానాలు మళ్లీ ఆకాశమార్గం పట్టే అవకాశం ఉన్నట్టు కేంద్ర వర్గాలు తెలిపాయి. దీనిపై బుధవారం  అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నది. మరోవైపు ప్రయాణికులు, సిబ్బంది, సంస్థలు ఎలా నడుచుకోవాలో సూచించేలా కేంద్ర పౌర విమానయాన శాఖ మార్గదర్శకాలను సిద్ధం చేసింది. ఇందుకోసం విమానయాన రంగ నిపుణులు, సంస్థలు, ప్రజాప్రతినిధులతో చర్చించింది. ఈ మేరకు రూపొందించిన ‘స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌' (ఎస్‌వోపీ) ముసాయిదాను పీటీఐ వార్తా సంస్థ సేకరించింది. దీని ప్రకారం.. 

ప్రయాణికులు పాటించాల్సినవి.. 

  • రెండు గంటల ముందే విమానాశ్రయానికి చేరుకోవాలి. గుర్తింపు పొందిన ట్యాక్సీల్లోనే రావాలి. 
  • ప్రతి ఒక్కరి ఫోన్‌లో ఆరోగ్యసేతు తప్పనిసరి. అందులో గ్రీన్‌ స్టేటస్‌ ఉండాలి. వెబ్‌ చెకిన్‌ సదుపాయం కూడా ఉంటుంది. 
  • విమానాశ్రయంలో ఇచ్చే పత్రాలను నింపాలి. ఇందులో గత 14 రోజుల్లో చేసిన ప్రయాణ వివరాలు, గత నెల రోజుల్లో నిర్బంధంలో (క్వారంటైన్‌లో) ఉన్నారా? వంటి ప్రశ్నలు ఉంటాయి. గత నెలరోజుల్లో క్వారంటైన్‌కు వెళ్లి వచ్చిన ప్రయాణికులను విమానాశ్రయంలోని సెక్యూరిటీ చెక్‌ పాయింట్‌ వద్దకు తీసుకెళ్లి పరీక్షిస్తారు. 
  • విమానం క్యాబిన్‌లోకి సామాన్లు తీసుకురావడంపై నిషేధం. 
  • (కొన్నాళ్లపాటు)
  • ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలి. విమానాశ్రయంలో, విమానంలో వస్తువులను, ఉపరితలాలను వీలైనంత తక్కువగా ముట్టుకోవాలి. 

సిబ్బంది, సంస్థలు పాటించాల్సినవి.. 

  • దేశీయ, విదేశీ ప్రయాణికులకు ప్రవేశ, నిష్క్రమణ మార్గాల్లో శరీర ఉష్ణోగ్రత పరీక్షలు తప్పనిసరి. 
  • హోదాతో సంబంధం లేకుండా సిబ్బంది మొత్తం ఐడీ కార్డులు ధరించాలి. అవి ఉంటేనే ఎయిర్‌పోర్ట్‌లోకి అనుమతించాలి. 
  • సిబ్బంది నిర్ణీత దూరం పాటించాలి. 
  • ఒక విమానం కోసం నియమించిన సిబ్బందిని సాధ్యమైనంత వరకు అందులోనే కొనసాగించాలి. 
  • వైద్య సహాయం అవసరమయ్యే ప్రయాణికుల కోసం ప్రతి విమానంలో మూడు వరుసల సీట్లను ఖాళీగా ఉంచాలి. 
  • ఏదైనా కారణం వల్ల ప్రయాణికుడిని విమానంలోకి అనుమతించకపోతే.. వారి ప్రయాణ తేదీ మార్పునకు లేదా డబ్బు పూర్తిగా వాపస్‌ ఇవ్వడానికి విమానయాన సంస్థలు అంగీకరించాలి. 
  • ప్రతి ఎయిర్‌పోర్ట్‌లో ఐసొలేషన్‌ జోన్‌ ఉండాలి. కరోనా అనుమానిత లక్షణాలున్నవారిని అందులో ఉంచి, వైద్య సహాయం అందించాలి. 
  • లిఫ్టులు, ఎస్కలేటర్లు, కుర్చీలు, షాపింగ్‌ ఏరియా, ఫుడ్‌ జోన్లు వంటి ప్రాంతాల్లో నిర్ణీత దూరం పాటించేలా గుర్తులు పెట్టాలి. 
  • హ్యాండ్‌వాష్‌, శానిటైజర్లు అందుబాటులో ఉంచాలి. 
  • ప్రయాణికులు నిర్ణీత దూరం పాటించేలా మధ్య సీటును ఖాళీగా వదిలేయాలన్న డీజీసీఏ ప్రతిపాదనను ఈ ముసాయిదాలో ప్రస్తావించలేదు.


logo