శుక్రవారం 04 డిసెంబర్ 2020
National - Oct 29, 2020 , 17:06:33

ఎయిమ్స్ బోర్డులో వివాదాస్ప‌ద డాక్ట‌ర్‌.. త‌మిళుల ఆగ్ర‌హం

ఎయిమ్స్ బోర్డులో వివాదాస్ప‌ద డాక్ట‌ర్‌.. త‌మిళుల ఆగ్ర‌హం

హైద‌రాబాద్‌:  త‌మిళ‌నాడులోని మ‌ధురైలో ఎయిమ్స్‌ను ఏర్పాటు చేయ‌నున్నారు. అయితే ఆ ఇన్స్‌టిట్యూట్ కోసం బోర్డు స‌భ్యుల‌ను కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఇటీవ‌ల వివాదానికి గురైన డాక్ట‌ర్ శ‌న్‌ముగం సుబ్బ‌య్‌ను బోర్డు స‌భ్యుడిగా ప్ర‌క‌టించారు.  ఏబీవీపీ జాతీయ అధ్య‌క్షుడిగా కూడా ఆయ‌న ఉన్నారు. డాక్ట‌ర్ శ‌న్‌ముగం నియామ‌కాన్ని ప్ర‌శ్నిస్తూ .. త‌మిళులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.  ఈమ‌ధ్యే చెన్నైలోని త‌న అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న ఓ మ‌హిళ ఇంటి ముందు చెత్త‌ను వేయ‌డంతో పాటు ఆ ఇంటి త‌లుపు వద్ద మూత్ర విస‌ర్జ‌న చేసిన‌ట్లు డాక్ట‌ర్ శ‌న్‌ముగంపై ఆరోప‌ణ‌లు ఉన్నాయి.  పార్కింగ్ స్థలంలో వివాదం తలెత్త‌డం వ‌ల్ల డాక్ట‌ర్ శ‌న్‌ముగం ఆ వృద్ధ మ‌హిళ ఇంటి ముందు మూత్ర విస‌ర్జ‌న చేసిన‌ట్లు తెలిసింది.  దానికి సంబంధించిన వీడియోను కూడా రిలీజ్ చేశారు. అయితే పోలీసు ఫిర్యాదును మాత్రం స‌ద‌రు మ‌హిళ త‌ర్వాత వెనక్కి తీసుకున్నారు. సీసీ వీడియోను మార్పింగ్ చేసిన‌ట్లు డాక్ట‌ర్ శ‌న్‌ముగం ఆరోపించారు. 

మ‌ధురై ఎయిమ్స్ బోర్డులో శ‌న్‌ముగాన్ని స‌భ్యుడిగా నియ‌మించ‌డాన్ని ప్ర‌శ్నిస్తూ రాష్ట్ర రాజ‌కీయ నాయ‌కులు, సోష‌ల్ మీడియా యూజ‌ర్లు కేంద్ర ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని త‌ప్పుప‌డుతున్నారు.  శ‌న్‌ముగాన్ని నియ‌మించ‌డం అంటే మ‌హిళ‌ల‌ను అగౌర‌వ‌ప‌ర‌చ‌డ‌మే అంటూ విల్లుపురం ఎంపీ డీ ర‌వికుమార్ ఆరోపించారు. ఆ పోస్టు నుంచి డాక్ట‌ర్‌ను తొల‌గించాలంటూ విరుధాన‌గ‌ర్ ఎంపీ మానికం టాగూర్ డిమాండ్ చేశారు.  డీఎంకే ఎంపీ క‌నిమొళి కూడా ట్వీట్ చేస్తూ.. ఇది శ‌న్‌ముగం ప్ర‌వ‌ర్త‌న‌ను స‌మ‌ర్థిస్తున్నట్లుగా ఉంద‌ని ఆరోపించారు. బీజేపీ కార్య‌క‌ర్త‌ల‌కు ఇది ఊతం ఇస్తుంద‌న్నారు.