ఆదివారం 29 నవంబర్ 2020
National - Oct 29, 2020 , 02:35:20

‘ఆరోగ్య సేతు’ గురించి మాకేం తెల్వదు

‘ఆరోగ్య సేతు’ గురించి మాకేం తెల్వదు

  • ఆ యాప్‌ తయారీదారుల సమాచారం లేదు
  • ఎన్‌ఐసీ సమాధానం
  • సీఐసీ ఆగ్రహం.. షోకాజ్‌ నోటీసులు జారీ
  • కేంద్రం దిద్దుబాటు చర్యలు
  • యాప్‌ను తామే  రూపొందించినట్టు వెల్లడి

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ముఖానికి మాస్కు, చేతులకు శానిటైజర్‌, భౌతిక దూరం వంటి నియమాలతో పాటు మొబైల్‌లో ‘ఆరోగ్య సేతు’ యాప్‌ తప్పనిసరిగా వాడాలని కేంద్రం తన మార్గదర్శకాల్లో పేర్కొంది. లక్షలాదిమంది ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. అయితే, ఇప్పుడు ఏకంగా ఆ యాప్‌కి సంబంధించిన సమాచారమేదీ తమ వద్ద లేదని ప్రభుత్వం అంటున్నది. ‘ఆరోగ్య సేతు’ యాప్‌ను ఎవరు రూపొందించారని ప్రశ్నిస్తూ సౌరవ్‌ దాస్‌ అనే వ్యక్తి నేషనల్‌ ఇన్ఫర్మాటిక్స్‌ సెంటర్‌ (ఎన్‌ఐసీ), ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఐటీ మంత్రిత్వ శాఖలను సమాచారహక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా వివరాలు అడిగారు. అయితే, యాప్‌ను రూపొందించిన వ్యక్తులు, సంస్థల సమాచారం తమవద్దలేదని ఎన్‌ఐసీ, ఎలక్ట్రానిక్స్‌ మంత్రిత్వ శాఖ బదులిచ్చాయి. దాంతో ఎన్‌ఐసీకి, చీఫ్‌ పబ్లిక్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్లకు (సీపీఐవోస్‌) కేంద్ర సమాచార కమిషన్‌ (సీఐసీ) షోకాజ్‌ నోటీసులు జారీచేసింది. ఈ అంశంలో తప్పించుకునే సమాధానాల్ని ఎంత మాత్రం ఆమోదించబోయేదిలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. 

మేమే చేశాం 

విమర్శల నేపథ్యంలో ప్రభుత్వం దిట్టుబాటు చర్యలు చేపట్టింది. ఈ యాప్‌ను పబ్లిక్‌-ప్రైవేట్‌ భాగస్వామ్యంతో 21 రోజుల్లోనే  అభివృద్ధి చేసినట్టు చెప్పింది. 

అప్పుడు సర్కార్‌ ఏమన్నదంటే?

‘ఆరోగ్య సేతు’లో భద్రతాపరమైన సమస్యలు ఉన్నాయని, ఈ యాప్‌ను ప్రైవేటు ఆపరేటర్లు నిర్వహిస్తున్నారని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ గతంలో అనుమానాలు వ్యక్తం చేశారు. దీనిని కేంద్ర మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ ఖండించారు.  ‘ఆరోగ్య సేతు’ యాప్‌ నిర్వహణను ఏ ప్రైవేటు ఆపరేటర్లు చేపట్టడంలేదని వెల్లడించారు. 

‘ఆరోగ్య సేతు’ యాప్‌.. రికార్డులు

  • ఆగస్టు 11నాటికి ఈ యాప్‌ను 15 కోట్ల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు.
  • ప్రపంచంలో ఒక్కరోజులో 1.01 కోట్ల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్న ఏకైక యాప్‌ 
  • ‘ఆరోగ్య సేతు’ యాప్‌ సేవలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రశంసలు కురిపించింది.