గురువారం 21 జనవరి 2021
National - Jan 11, 2021 , 14:55:23

‘26 తర్వాత.. నా రాజీనామాను ఆమోదించండి’

‘26 తర్వాత.. నా రాజీనామాను ఆమోదించండి’

చండీగఢ్‌: వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. హర్యానా ఎమ్మెల్యే, ఇండియన్‌ నేషనల్‌ లోక్‌ దళ్‌ (ఐఎన్‌ఎల్డీ) చీఫ్‌ అభయ్‌ సింగ్‌ చౌతాలా తాజాగా దీని కోసం రాజీనామా ప్రతిపాదన చేశారు. ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌కు సోమవారం ఒక లేఖ రాశారు. జనవరి 26 నాటికి కేంద్ర ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోకపోతే ఈ లేఖను రాష్ట్ర అసెంబ్లీకి రాజీనామాగా పరిగణించాలని అభయ్‌ సింగ్‌ చౌతాలా అందులో కోరారు. 

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులకు పార్టీ తరుఫున ఆయన తొలి నుంచి సంఘీభావం తెలిపారు. డిసెంబర్‌ 8న రైతు సంఘాలు పిలుపునిచ్చిన భారత్‌ బంద్‌కు కూడా మద్దతు తెలిపారు. తాజాగా రైతుల కోసం రాజీనామాకు కూడా సిద్ధమయ్యారు. 

కాగా, వ్యవసాయ చట్టాలు, రైతుల నిరసనల పట్ల మొండిగా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వం తీరుపై సుప్రీంకోర్టు కూడా సోమవారం అసంతృప్తి వ్యక్తం చేసింది. వ్యవసాయ చట్టాలను కేంద్రం నిలిపివేస్తుందా లేదా తామే ఆ పని చేయాలా అంటూ మండిపడింది. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo