శుక్రవారం 03 జూలై 2020
National - Jun 19, 2020 , 12:43:11

ల‌డ‌ఖ్‌ స‌మ‌స్య‌పై అఖిలప‌క్ష భేటీ.. ఆహ్వానం అంద‌లేద‌ని ఆగ్ర‌హం

ల‌డ‌ఖ్‌ స‌మ‌స్య‌పై అఖిలప‌క్ష భేటీ.. ఆహ్వానం అంద‌లేద‌ని ఆగ్ర‌హం

హైద‌రాబాద్‌: గాల్వ‌న్ లోయ‌లో చైనా దాష్టీకాన్ని ఖండిస్తూ.. ఇవాళ ప్ర‌ధాని మోదీ అఖిల ప‌క్ష భేటీ నిర్వ‌హిస్తున్నారు. సాయంత్రం 5 గంట‌లకు ఆ స‌మావేశం జ‌ర‌గ‌నున్న‌ది.  చైనాతో ఉన్న స‌రిహ‌ద్దు స‌మ‌స్య‌పై ఏం చేద్దామ‌న్న విష‌యాన్ని మోదీ.. అఖిల ప‌క్ష నేత‌ల‌తో చ‌ర్చించ‌నున్నారు. అయితే ఈ స‌మావేశాల‌కు హాజ‌రుకావాలంటూ.. ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌.. అన్ని పార్టీల అధ్య‌క్షుల‌కు ఫోన్ చేసి ఆహ్వానం పంపారు. కానీ ఆహ్వానం అంద‌ని పార్టీలు మాత్రం తీవ్ర అస‌హ‌నాన్ని వ్య‌క్తం చేస్తున్నాయి. ఢిల్లీకి చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ,  బీహార్‌కు చెందిన ఆర్జేడీలు.. కేంద్ర ప్ర‌భుత్వ తీరును ఖండిస్తున్నాయి.  

ఈ స‌మావేవానికి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ,  తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీలు .. అఖిల ప‌క్ష భేటీకి హాజ‌ర‌య్యే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది.  అయితే త‌మ‌కు ఆహ్వానం అంద‌లేదంటూ.. ఆర్జేడీ నేత తేజ‌స్వి యాద‌వ్‌.. త‌న ట్విట్ట‌ర్‌లో ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఏ ప్రాతిప‌దిక‌న రాజ‌కీయ పార్టీల‌కు ఆహ్వానం పంపారంటూ ఆయ‌న ప్ర‌శ్నించారు.   

అయితే లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ‌లో క‌లిపి.. అయిదు స‌భ్యుల క‌న్నా ఎక్కువ సంఖ్య ఉన్న పార్టీల‌కు మాత్ర‌మే కేంద్రం ఆహ్వానం పంపిన‌ట్లు ప్ర‌భుత్వ వ‌ర్గాల ద్వారా తెలుస్తున్న‌ది. సీఎం కేజ్రీవాల్‌కు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీకి.. కేవ‌లం న‌లుగురు ఎంపీలు మాత్ర‌మే ఉన్నారు. కానీ ఆర్జేడీకి పార్ల‌మెంట్‌లో అయిదుగురు ఎంపీలు ఉన్నారు. మ‌రి వారికెందుకు ఆహ్వానం అంద‌లేద‌ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.  గాల్వ‌న్ లోయ‌లో జ‌రిగిన హింసాత్మ‌క ఘ‌ర్ష‌ణ‌ల‌ను కాంగ్రెస్‌తో పాటు అన్ని విప‌క్ష పార్టీల‌ను కేంద్రాన్ని ప్ర‌శ్నించాయి.  

ల‌డ‌ఖ్ విష‌యంలో అఖిల ప‌క్ష భేటీ స‌రైందే అని బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ తెలిపారు.  దేశ ర‌క్ష‌ణ విష‌యంలో ఎటువంటి రాజీప‌డేది లేద‌ని తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా స్ప‌ష్టం చేసిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఇవాళ జ‌ర‌గ‌నున్న అఖిల ప‌క్ష భేటీ ప్రాధాన్య‌త సంత‌రించుకున్న‌ది. 

logo