గురువారం 02 ఏప్రిల్ 2020
National - Feb 12, 2020 , 11:48:58

ఢిల్లీ ఆర్థిక శాఖ మంత్రిగా రాఘవ్‌ చాదా?

ఢిల్లీ ఆర్థిక శాఖ మంత్రిగా రాఘవ్‌ చాదా?

న్యూఢిల్లీ : ఢిల్లీలో ఈ నెల 14న ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభుత్వం కొలువుదీరనుంది. ఇప్పటికే రెండు పర్యాయాలు సీఎంగా సేవలందించిన అరవింద్‌ కేజ్రీవాల్‌ ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ క్రమంలో కేజ్రీవాల్‌ మంత్రివర్గ కూర్పుపై కూడా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. కేబినెట్‌లోకి ఎవరెవర్ని తీసుకోవాలనే అంశంపై సమాలోచనలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే కొత్తగా శాసనసభకు ఎన్నికైన ఇద్దరు యువ ఎమ్మెల్యేలకు మాత్రం మంత్రి పదవులు ఖాయమని వార్తలు షికారు చేస్తున్నాయి.

రాజీందర్‌ సింగ్‌ నియోజకవర్గం నుంచి గెలుపొందిన రాఘవ్‌ చాదా, కల్కాజీ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన అతిషి మర్లేనాకు మంత్రివర్గంలో చోటు లభించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వృత్తిరీత్యా చార్టర్డ్‌ అకౌంటెంట్‌ అయిన రాఘవ్‌ చద్దాకు ఆర్థిక శాఖ కట్టబెట్టనున్నట్లు సమాచారం. ఆప్‌ అధికార ప్రతినిధిగా, పార్టీ లీగల్‌ అఫైర్స్‌ ఇంచార్జిగా కొనసాగుతున్నారు రాఘవ్‌. 2015లో ఆప్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక శాఖ సలహాదారుగా చాదా పని చేశారు. అయితే రాఘవ్‌ నియామకం చట్టవిరుద్ధమని పేర్కొంటూ కేంద్రం ఆయనతో పాటు మరో 9 మందిని తొలగించింది. దీంతో చాదా 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆప్‌ తరపున పోటీ చేసి ఓటమి చవిచూశారు.

ఇక అతిషికి విద్యాశాఖ కేటాయించనున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో విద్యాశాఖ విషయంలో డిప్యూటీ సీఎం మనీశ్‌ సిపోడియాకు సలహాదారుగా పని చేసిన అతిషి.. ఢిల్లీ విద్యారంగంలో సంస్కరణలు తీసుకొచ్చారు. ఆప్‌ పొలిటికల్‌ అఫైర్స్‌ సభ్యురాలిగా ఆమె కొనసాగుతున్నారు. అతిషి కూడా 2019 లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు.


logo
>>>>>>