సోమవారం 30 నవంబర్ 2020
National - Nov 05, 2020 , 16:12:07

దీపావళికి ఇంటి వద్దనే లక్ష్మీపూజలు : కేజ్రీవాల్

దీపావళికి ఇంటి వద్దనే లక్ష్మీపూజలు : కేజ్రీవాల్

న్యూఢిల్లీ : రానున్న దీపావళికి ఇంటివద్దనే లక్ష్మీపూజలు చేసుకోవాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ సూచించారు. తనతోపాటు తన మంత్రిమండలి సభ్యులు కూడా తమతమ ఇండ్లలోనే లక్ష్మీదేవి పూజ కార్యక్రమాలు జరుపుకోవాలని కోరారు. పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని నివారించడంలో భాగంగా ప్రభుత్వంతో సహకరించాలని ఆయన విజ్ఞప్తిచేశారు. అలాగే, కొవిడ్-19 పరిస్థితి క్షీణిస్తున్నందున పటాకులు పేల్చవద్దని సీఎం అరవింద్ కేజ్రీవాల్ గురువారం ఆన్‌లైన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రజలను కోరారు. కేజ్రీవాల్ తన క్యాబినెట్ మంత్రులతో కలిసి నవంబర్ 14 రాత్రి 7:39 గంటలకు 'లక్ష్మి పూజ' చేపట్టనున్నట్టు చెప్పారు. గత ఏడాది దీపావళి సందర్భంగా ఢిల్లీ ప్రభుత్వం కన్నాట్ ప్లేస్‌లో లేజర్ షో వైభవంగా నిర్వహించింది.

"ఈసారి కూడా మేం దీపావళిని ఘనంగా జరుపుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లోనూ పటాకులు పేల్చం. రెండు కోట్ల మంది ప్రజలు లక్ష్మి పూజలు చేస్తారు. కాబట్టి అద్భుతమైన వాతావరణం, మంచి వైబ్‌లు ఉంటాయి. ఇది ప్రతి ఇళ్లు శ్రేయస్సుకు దారితీస్తుంది" అని కేజ్రీవాల్ చెప్పారు. ప్రస్తుతం, ఢిల్లీ ప్రభుత్వం అటు వాతావరణం, ఇటు కొవిడ్‌-19 సమస్యలను ఎదుర్కొంటున్నదని, ఆప్ ప్రభుత్వం పరిస్థితిని పరిష్కరించడంలో ఎటువంటి అవకాశాన్ని వదిలివేయడం లేదని అన్నారు. వాయు కాలుష్యం పెరగడం వల్ల కొవిడ్‌-19 వ్యాప్తి జరిగే అవకాశాలు ఉన్నందున ఈ దీపావళికి పటాకులు పేల్చకుండా ఉండటం మంచిదని ప్రజలను కోరారు. 

ఢిల్లీలో బుధవారం 6,800 కి పైగా కొవిడ్-19 కేసులతో కొత్త రికార్డు నమోదైంది. గురువారం ఉదయం పొగమంచు ఢిల్లీ, పరిసర ప్రాంతాలపై కప్పేసింది. పొరుగు రాష్ట్రాల నుంచి వ్యవసాయ వ్యర్థాలను కాల్చిన పొగలు రావడంతో గాలి వేగం, ఉష్ణోగ్రతల్లో మార్పులు వచ్చి ఇబ్బందులకు గురిచేస్తున్నది. పంట వ్యర్థాలు దహనం చేయడం వల్ల కొవిడ్‌-19 పరిస్థితిని మరింత దిగజారుస్తుందని మీడియా సమావేశం సందర్భంగా కేజ్రీవాల్ పేర్కొన్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.