గురువారం 04 జూన్ 2020
National - Jan 28, 2020 , 02:11:11

పూర్వాంచల్‌ ఓటర్లే కీలకం

పూర్వాంచల్‌ ఓటర్లే కీలకం
  • అన్ని నియోజకవర్గాల్లో విస్తరించిన ఓటర్ల్లు
  • 25-28 స్థానాల్లో పంజాబీలు కీలకం

న్యూఢిల్లీ, జనవరి 27: దేశ రాజధానిలో ఎన్నికల కోలాహలం జోరందుకుంది. ఎన్నికల తేదీ దగ్గరపడుతుండడంతో ప్రధాన రాజకీయపార్టీలు తమ ప్రచారాన్ని ఉద్ధృతం చేశాయి. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్‌) ప్రయత్నిస్తుండగా, మరోసారి ఢిల్లీలో పాగా వేయాలని కాంగ్రెస్‌, బీజేపీ పోరాడుతున్నాయి. అయితే ఢిల్లీలో అసెంబ్లీ ఏర్పాటైన నాటి నుంచి పూర్వాంచల్‌ ఓటర్లే (తూర్పు ఉత్తర ప్రదేశ్‌, బీహార్‌, జార్ఖండ్‌ వాసులు) పార్టీల గెలుపోటములను నిర్ణయిస్తున్నారు.  70 నియోజకవర్గాల్లో  విస్తరించి ఉన్న పూర్వాంచల్‌ ఓటర్లు  ఎటువైపు మొగ్గితే ఆ పార్టీ అధికార పగ్గాలు చేపట్టింది. అయితే ఈసారి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు. పూర్వాంచల్‌ ఓటర్ల మనస్సులు చూరగొనేందుకు మూడు పార్టీలు పోటీ పడుతుండటంతో వారి ఓట్లు చీలిపోతాయని భావిస్తున్నారు. అదే జరిగితే 35 శాతానికి పైగా ఉన్న పంజాబీ ఓటర్లు మెజారిటీ స్థానాల్లో అభ్యర్థుల గెలుపోటములను నిర్దేశిస్తారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఢిల్లీలోని 1.5 కోట్ల జనాభాలో పంజాబీలు, పూర్వాంచల్‌ వాసులు కలిపి సుమారు 70% మంది ఉంటారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) వ్యతిరేక ఆందోళనల వల్ల 12% మంది ముస్లింలు బీజేపీకి వ్యతిరేకంగా ఓటేస్తారని అభిప్రాయ పడుతున్నారు. 


1993లో బీజేపీ పవర్‌ ఫార్ములా

70 స్థానాలు గల ఢిల్లీ అసెంబ్లీకి 1993లో జరిగిన తొలి ఎన్నికల్లో పంజాబీ ఓటర్లే కీలకమయ్యారు. నాడు బీజేపీ అమలు చేసిన పంజాబీ-బనియా-అగ్రకులాల ఫార్ములా ఆ పార్టీకి అధికారం కట్టబెట్టింది. తర్వాత 1998-2008 మధ్య మూడుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్‌కు  పూర్వాంచల్‌ వాసులు అండగా నిలిచారు. షీలా దీక్షిత్‌ 15 ఏండ్లు ఢిల్లీ సీఎంగా ఉన్నారు. అరవింద్‌ కేజ్రీవాల్‌ సారథ్యంలోని ఆప్‌ 2013లో తొలిసారి, 2015లో రెండోసారి ప్రధాన రాజకీయ పార్టీలను కంగుతినిపించి అధికారాన్ని చేపట్టింది. 


మనోజ్‌ తివారీపైనే కమలనాథుల ఆశలు

సినీ గాయకుడు మనోజ్‌ తివారీని 2016లో బీజేపీ ఢిల్లీ శాఖ అధ్యక్షుడిగా నియమించింది. ఆయన రూపొందించిన మ్యూజిక్‌ ఆల్బంలు, బోజ్‌పురీ సినిమాల్లో పాడిన పాటలకు పూర్వాంచల్‌ ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. అందుకే బీజేపీ ఢిల్లీశాఖ అధ్యక్షుడిగా మనోజ్‌ తివారీని నియమించినప్పుడు సీనియర్ల నుంచి వ్యతిరేకత రాలేదన్న మాటలు వినిపించాయి. ఢిల్లీలో పెద్దగా బలం లేకున్నా, బీజేపీకి జేడీయూ మద్దతు లభించనున్నది. 


కాంగ్రెస్‌ ప్రచార కమిటీ చీఫ్‌గా కీర్తి ఆజాద్‌

మాజీ క్రికెటర్‌, మాజీ ఎంపీ కీర్తి ఆజాద్‌ను ఢిల్లీ ఎన్నికల ప్రచార కమిటీ చీఫ్‌గా కాంగ్రెస్‌ పార్టీ నియమించింది. బీహార్‌లోని దర్భంగా స్థానం నుంచి మూడుసార్లు లోక్‌సభకు ఎన్నికైన కీర్తి ఆజాద్‌ 2015 నుంచి బీజేపీకి పక్కలో బల్లెంలా ఉన్నారు. పూర్వాంచల్‌ ఓట్లను తమవైపుకు తిప్పుకోవడంలో కీర్తి ఆజాద్‌ కీలకంగా వ్యవహరిస్తారని కాంగ్రెస్‌ ఆశలు పెట్టుకున్నది. ఆర్జేడీతో కలిసి కాంగ్రెస్‌ ఎన్నికల బరిలో నిలువగా, ఆప్‌ పార్టీ పూర్వాంచల్‌ వారికి 12 టిక్కెట్లు కేటాయించింది.  


25-28 స్థానాల్లో పంజాబీలు కీలకం

ఢిల్లీలోని 25-28 స్థానాల్లో పంజాబీ ఓటర్లు కీలకం కానున్నారు. 19 స్థానాల్లో సంప్రదాయ పంజాబీ ఓటర్లు.. ప్రత్యేకించి నాలుగు నియోజకవర్గాల్లో పూర్తిగా సిక్కులదే ఆధిపత్యం. గతంలో శిరోమణి అకాలీదళ్‌ (ఎస్‌ఏడీ)తో కలిసి బీజేపీ పోటీ చేసింది. సీఏఏపై విభేదాల సాకుతో ఎస్‌ఏడీ పోటీకి దూరంగా ఉండటం.. వ్యూహాత్మకంగా బీజేపీకి సానుకూలంగా మారుతుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.logo