సోమవారం 08 మార్చి 2021
National - Jan 28, 2021 , 13:37:31

ఆరు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ పోటీ

ఆరు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ పోటీ

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా చారిత్రాత్మక విజయాన్ని సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ.. ఇప్పుడు ఇతర రాష్ట్రాలలో విస్తరణకు సిద్ధమవుతున్నది. ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చే రెండేండ్లలో ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్ సహా 6 రాష్ట్రాలకు జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ అభ్యర్థులను నిలబెట్టనున్నట్లు ప్రకటించింది. ఆప్ జాతీయ కౌన్సిల్ సమావేశంలో పార్టీ అధిపతి అరవింద్ కేజ్రీవాల్ ఈ నిర్ణయం తీసుకున్నారు. 

ఆప్ గతంలో గుజరాత్, గోవా, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ అభ్యర్థులను నిలబెట్టింది. పంజాబ్‌లో గణనీయమైన సంఖ్యలో ఎమ్మెల్యేలు గెలుపొందారు. అక్కడ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్నది. రాజకీయ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ 6 రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో ఆప్ బాగా రాణించి ఓట్లు, సీట్ల శాతం సాధించినపక్షంలో జాతీయ పార్టీ రికార్డును కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. 403 అసెంబ్లీ స్థానాలు ఉన్నందున ఉత్తర ప్రదేశ్ ఎన్నికలు.. రాజకీయ హోదా పరంగా అన్ని పార్టీలకు చాలా ముఖ్యమైనవి. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‌తోపాటు గుజరాత్‌, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, గోవా రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఇంకా ఏడాది సమయం ఉన్నందున ఇప్పటినుంచే ఆయా రాష్ట్రాల్లో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రణాళికలను ఆప్‌ నాయకత్వం సిద్ధం చేస్తున్నది. అదేవిధంగా వచ్చే నెలలో ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని పంచాయతీలకు జరుగనున్న ఎన్నికల్లో కూడా తమ అభ్యర్థులను నిలుపాలన్న యోచనలో ఆప్‌ ఉన్నది. ఈ విషయాన్ని ఇప్పటికే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ వెల్లడించారు. ఎన్నికలను సీరియస్‌గా తీసుకొన్న కేజ్రీవాల్‌.. అక్కడ ఎన్నికల పరిశీలకుడిగా ఢిల్లీ ప్రభుత్వ క్యాబినెట్ మంత్రి రాజేంద్ర పాల్ గౌతమ్‌ను నియమించారు.

ఇటీవల ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా లక్నో వెళ్ళిన సమయంలో అక్కడ రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావారణం నెలకొన్నది. నిజానికి మనీష్ సిసోడియా ప్రభుత్వ పాఠశాలను సందర్శించాలని ముందుగా భావించారు. అయితే, యూపీ పోలీసులు శాంతిభద్రతల సమస్య అని పేర్కొంటూ సిసోడియాను ఆ స్కూలుకు వెళ్లకుండా నిలువరించారు. ఈ ఎపిసోడ్ అనంతరం రెండు పార్టీల నాయకుల మధ్య బలమైన వాగ్వాదం కొనసాగింది. తాము స్కూల్‌ను సందర్శిస్తే యూపీ ప్రభుత్వం పనితీరు బట్టబయలు అవుతుందని భయపడటం వల్లనే శాంతిభద్రతల సమస్యగా పేర్కొన్నారని సిసోడియా విమర్శించారు. ఏది ఏమైనప్పటికీ, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో బలమైన ప్రత్యర్థిగా మారేందుకు ఆప్‌ గత కొన్నాళ్లుగా పావులు కదుపుతున్నది. వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చి నెలలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలకు పంచాయతీ ఎన్నికల నుంచే రిహార్సల్స్‌ చేపట్టడం విశేషం.

ఇవి కూడా చదవండి..

చరిత్రలో ఈరోజు.. కైఫ్‌ కెప్టెన్సీలో అండర్‌-19 కప్‌ అందుకున్న భారత్‌

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo