శనివారం 15 ఆగస్టు 2020
National - Jul 17, 2020 , 19:16:09

ప్రియురాలిని కలుసుకోవడానికి మహారాష్ర్ట నుంచి పాకిస్తాన్‌కు బయల్దేరాడు

ప్రియురాలిని కలుసుకోవడానికి మహారాష్ర్ట నుంచి పాకిస్తాన్‌కు బయల్దేరాడు

  • 1200 కి.మీ ప్రయాణం చేసిన తరువాత బార్డర్‌లో బీఎస్‌ఎఫ్‌ సిబ్బందికి చిక్కాడు

న్యూ ఢిల్లీ : గుజరాత్‌లోని రాన్ ఆఫ్ కచ్ ప్రాంతంలో ఓ 20 ఏళ్ల యువకుడిని బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది గురువారం పట్టుకున్నారు. అతడు తన ప్రియురాలిని కలుసుకోవడానికి పొరుగున ఉన్న పాకిస్తాన్‌కు వెళ్లడానికి ప్రయత్నిస్తుండగా బార్డర్‌ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ నుంచి వచ్చిన ఈ యువకుడు పాకిస్తాన్‌ కరాచీలోని షా ఫైసల్ పట్టణానికి చెందిన తన ప్రియురాలిని కలుసుకోవడానికి 1200 కిలోమీటర్లు ప్రయాణించినట్లు వెల్లడించాడు.

సిద్దిఖీ మొహమ్మద్ జిషాన్ అనే వ్యక్తికి ఫేస్‌బుక్‌లో కరాచీకి చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడింది. వారు నిత్యం ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లో చాటింగ్‌ చేసుకునేవారు. ఈ నేపథ్యంలో జిషాన్‌ ఆమెను కలవడానికి పాకిస్తాన్‌ వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాడు. గూగుల్‌ మ్యాప్‌ ద్వారా పాక్‌ సరిహద్దు వరకు బైక్‌పై ప్రయాణం చేసి చివరకు బీఎస్‌ఎఫ్‌ సిబ్బందికి చిక్కాడు. 

 సెర్చ్ ఆపరేషన్ సమయంలో బీఎస్‌ఎఫ్‌ సరిహద్దు వద్ద మొదట యువకుడి బైక్‌ కనబడింది. మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ పోలీసుల సమాచారం ఆధారంగా ఆ యువకుడిని ఇండో-పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దు నుంచి 1.5 కిలోమీటర్ల దూరంలో పట్టుకున్నారు. రాన్ ఆఫ్ కచ్ దాటడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అతడు స్పృహ తప్పాడని సిబ్బంది తెలియజేశారు. అతడి వద్దనున్న ఏటీఎం కార్డు, ఆధార్‌, పాన్‌ కార్డు ద్వారా యువకుడిని వారు గుర్తించినట్లు సిబ్బంది తెలియజేశారు. 

యువకుడి తల్లిదండ్రులు ఇచ్చిన మిస్సింగ్‌ కేసు నేపథ్యంలో మహారాష్ట్ర పోలీసులు గుజరాత్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. గుజరాత్ పోలీసులు బార్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్ సిబ్బంది సాయం కోరగా అతడి మొబైల్ ఫోన్‌ ట్రాక్ చేసిన తరువాత యువకుడిని ధోలావిరా సమీపంలోని ప్రాంతంలో గుర్తించారు. తదుపరి దర్యాప్తు కోసం బీఎస్ఎఫ్ సిబ్బంది యువకుడిని పోలీసులకు అప్పగించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo