సోమవారం 03 ఆగస్టు 2020
National - Jul 05, 2020 , 18:01:43

అత్యాచార నిందితుడి నుంచి రూ.35 లక్షలు లంచం తీసుకున్న మహిళా ఎస్‌ఐ అరెస్టు

అత్యాచార నిందితుడి నుంచి రూ.35 లక్షలు లంచం తీసుకున్న మహిళా ఎస్‌ఐ అరెస్టు

అహ్మదాబాద్‌ : అహ్మదాబాద్‌లో లైంగిక దాడికి పాల్పడిన నిందితుల నుంచి రూ.35 లక్షల లంచం తీసుకున్న మహిళా ఎస్‌ఐని ఆదివారం అరెస్టు చేశారు. అనంతరం కేసు నమోదు చేసి ఆమెను కోర్టులో హాజరుపర్చారు. నిందితురాలు ఎస్‌ఐ శ్వేతా జడేజా అహ్మదాబాద్‌లోని మహిళా పోలీస్‌స్టేషన్‌కు ఇన్‌చార్జిగా ఉంది.

పోలీసుల కథనం ప్రకారం.. అహ్మదాబాద్‌లోని ఒక ప్రైవేట్ కంపెనీకి చెందిన ఇద్దరు మహిళా ఉద్యోగులు కంపెనీ ఎండీ కెనాల్‌ షా తమపై లైంగికదాడి చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే విషయమై కంపెనీకి చెందిన మరో అధికారి కూడా అహ్మదాబాద్‌లోని శాటిలైట్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీనిపై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

ఈ కేసు దర్యాప్తులో మహిళా పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌చార్జి శ్వేతా జడేజా, నిందితుల నుంచి రూ.35 లక్షల లంచం డిమాండ్ చేశారు. డబ్బు ఇవ్వకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నిందితులను హెచ్చరించారు. ఈ మేరకు కెనాల్ షా సోదరుడు భావేష్‌ను పిలిచి లంచం డిమాండ్ చేయగా రూ.20 లక్షలకు బేరం కుదిరింది. ఈ డబ్బు మొత్తాన్ని జమ్‌జోద్‌పూర్‌లో ఎస్‌ఐకు తెలిసిన వ్యక్తికి అందజేశారు. ఈ నేపథ్యంలో కెనాల్‌ షాపై మరో కేసు నమోదైంది. ఇదే అదునుగా భావించిన ఎస్‌ఐ శ్వేతా జడేజా మరోసారి నిందితుడి సోదరుడి నుంచి రూ .20 లక్షలు డిమాండ్ చేసింది. అయితే అతను రూ.15 లక్షలు ఇస్తానని ఒప్పుకొని ఆ మొత్తాన్ని అందజేశాడు. 

ఇదే సమయంలో నిందితుడు కెనాల్‌ షాను పోలీసులు అరెస్టు చేయగా.. లంచం ఇచ్చినా అరెస్టు చేయడమేంటని నిందితుడి సోదరుడు భావేష్‌ మహిళా ఎస్‌ఐ శ్వేతపై పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే విచారణ చేపట్టిన పోలీసులు ఎస్‌ఐ శ్వేతా జడేజాపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పరిచారు. ఈ మొత్తం కేసు దర్యాప్తును ఇప్పుడు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఏసీపీ బీసీ సోలంకికి అప్పగించినట్లు క్రైమ్ బ్రాంచ్ జాయింట్ పోలీస్ కమిషనర్ అజయ్ తోమర్ చెప్పారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo