గురువారం 26 నవంబర్ 2020
National - Nov 12, 2020 , 20:56:15

మాజీ మేయర్‌ కోసం లుకౌట్‌ నోటీస్‌

మాజీ మేయర్‌ కోసం లుకౌట్‌ నోటీస్‌

బెంగళూరు: కర్ణాటకలోని బెంగళూరు మాజీ మేయర్‌, కాంగ్రెస్‌ నేత ఆర్‌ సంపత్‌ రాజ్‌ కోసం పోలీసులు లుకౌట్‌ నోటీస్‌ జారీ చేసినట్లు ఆ రాష్ట్ర హోంమంత్రి బసవరాజ్ బొమ్మాయ్‌ తెలిపారు. ఆగస్టు నెలలో బెంగళూరులో జరిగిన హింసకు సంబంధించిన కేసులో నిందితుడైన ఆయన ఆచూకీని గుర్తించేందుకు సిటీ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. సంపత్‌ రాజ్‌ను త్వరలో అరెస్టు చేస్తామని బసవరాజ్ తెలిపారు. 

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శ్రీనివాస్‌ మూర్తి మేనల్లుడు ఒక వర్గాన్ని కించపరిచేలా సామాజిక మాధ్యమంలో పోస్టు చేశాడు. దీంతో ఆగస్టు 11 రాత్రి వందలాది మంది ముస్లిం యువకులు బెంగళూరు నగరంలోని కేజీ హల్లి, డీజే హల్లి ప్రాంతాల్లో హింసకు పాల్పడ్డారు. ఈ సందర్భంగా పోలీసులు, ఆందోళనకారుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో సుమారు వంద మంది వరకు గాయపడగా పోలీస్‌ కాల్పుల్లో ముగ్గురు మరణించారు. 

ఈ అల్లర్లలో ఆందోళనకారులు మూర్తి నివాసం, స్థానిక పోలీస్‌ స్టేషన్లపై దాడి చేశారు. వందలాది వాహనాలకు నిప్పుపెట్టారు. ఈ ఘటనకు సంబంధించి వంద మందికిపైగా నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. కాగా ఈ హింస వెనుక కుట్ర ఉన్నదని బీజేపీ ప్రభుత్వం ఆరోపించింది. ఈ ఘటన రాజకీయ పార్టీల మధ్య విమర్శలకు దారి తీసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.