గురువారం 04 జూన్ 2020
National - May 11, 2020 , 11:54:08

ఢిల్లీ ఏర్‌పోర్టులో బందీగా విదేశీయుడు

ఢిల్లీ ఏర్‌పోర్టులో బందీగా విదేశీయుడు

హైదరాబాద్: ఢిల్లీలోని ఇందిరాగాంధి అంతర్జాతీయ విమానాశ్రయం విమానాల రాకపోకలు నిలిచిపోయిన కారణంగా ఖాళీగా ఉంది. కానీ ఒక విదేశీయుడు మాత్రం అక్కడ 54 రోజులకు పైగా బందీగా గడుపుతున్నాడు. జర్మనీకి చెందిన ఎడ్గార్డ్ జియెబాత్ (40) మార్చి 18న వియత్నాం రాజధాని హనోయ్ నుంచి ఇండియాకు వచ్చాడు. అతడు టర్కీకి వెళ్లాలి. కేవలం విమానం మారేందుకు ఢిల్లీలో దిగాడు. కానీ అదే రోజు భారత ప్రభుత్వం టర్కీకి విమానాల్ని రద్దు చేసింది. మార్చి 25న మొత్తంగా విమానాల రాకపోకలు రద్దయ్యాయి. మనవాడు చేసేదేమీ లేక ట్రాన్సిట్ ఏరియాలో ఉండిపోయాడు. కొందరు ఇతర దేశాలవారు కూడా అలా చిక్కుబడితే ఆయా దేశాల రాయబార కార్యాలయాలు వారికి ఏర్పాట్లు చేశాయి. కానీ ఎడ్గార్డ్ పరిస్థితి వేరు. అతనికి జర్మనీలో నేరచరిత్ర ఉంది. ఇతరులపై దాడిచేయడం వంటి కేసులు ఏవో నడుస్తున్నాయి. అందువల్ల భారత్ వీసా నిరాకరించింది. ఇక జర్మనీయేమో విదేశీ గడ్డ మీద కస్టడీ తీసుకునేందుకు నిరాకరించింది. ఇప్పటిలెక్క ప్రకారమైతే మే 17 వరకు లాక్‌డౌన్ కొనసాగుతుంది. దానిని కొనసాగిస్తారా? లేక ఎత్తేస్తారా? ఎత్తేస్తే, విమానాలు తిరిగితే ఎక్కడికో అక్కడికి వెళతాడు. లేకపోతే అధికారులు జర్మనీకి తిప్పిపంపడమో మరోటో చేసేంతవరకు 'ది టర్మినల్' సినిమాలో టామ్ హ్యాంక్స్ లాగా ట్రాన్సిట్ ఏరియాలో బందీగా బతకాల్సిందే.


logo