మంగళవారం 31 మార్చి 2020
National - Feb 13, 2020 , 03:27:43

వంటగ్యాస్‌ మంట

వంటగ్యాస్‌ మంట
  • గృహ వినియోగ సిలిండర్‌పై రూ.144.50 వడ్డన
  • ప్రతిపక్షాల ఆగ్రహం
  • పెరిగిన భారం భరిస్తామన్న కేంద్రం
  • హైదరాబాద్‌లో రూ.913.50కి పెరుగుదల

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: వంటగ్యాస్‌ ధర మరోసారి మండింది. 14.2 కిలోల గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్‌ ధరను రూ.144.50 పెంచుతున్నట్టు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు బుధవారం ప్రకటించాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో మారిన చమురు ధరలకు అనుగుణంగా ధరను పెంచుతున్నట్టు పేర్కొన్నాయి. 2014 జనవరిలో సిలిండర్‌ ధర ఒకేసారి రూ.220 పెరిగింది. ఆ తర్వాత దాదాపు ఆరేండ్లకు మరోసారి రికార్డు స్థాయిలో ధరలు పెరిగాయి. అయితే.. వినియోగదారులపై భారం పడకుండా పెరిగిన ధరను రాయితీగా అందిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో గృహ వినియోగదారులకు కాస్త ఊరట లభించింది.


ప్రస్తుతం ఢిల్లీలో గృహవినియోగ సిలిండర్‌ ధర రూ.714గా ఉన్నది. పెంపు అనంతరం ధర రూ.858.50కు చేరుకున్నది. ఈ మొత్తాన్ని సిలిండర్‌ తీసుకునే సమయంలో వినియోగదారులు చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత వినియోగదారుల బ్యాంకు ఖాతాలో సబ్సిడీ జమ అవుతుంది. ప్రస్తుతం సాధారణ వినియోగదారులకు ఒక్కో సిలిండర్‌కు రూ.153.86, ప్రధానమంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై) వినియోగదారులకు రూ.174.86 సబ్సిడిగా అందిస్తున్నారు. పెరిగిన ధరను కేంద్రం భరిస్తామని చెప్పడంతో ఇకపై సాధారణ వినియోగదారులకు రూ.291.48, పీఎంయూవై వినియోగదారులకు రూ.312.48 రాయితీ అందనున్నది. ప్రస్తుతం రాయితీని మినహాయిస్తే సాధారణ వినియోగదారులు ఒక్కో సిలిండర్‌కు రూ. 567.02, పీఎంయూవై వినియోగదారులు రూ.546.02 చెల్లిస్తున్నారు. ఇకపైనా ఈ ధరల్లో ఎలాంటి మార్పు ఉండబోదు. 


హైదరాబాద్‌లో.. 

హైదరాబాద్‌లో సిలిండర్‌ ధర ప్రస్తుతం రూ.769గా ఉండగా, పెరిగిన ధరల ప్రకారం వినియోగదారులు రూ.913.50 చెల్లించాల్సి ఉంటుంది. గతంలో రూ.200.50 సబ్సిడీ రాగా.. ఇకపై రూ.345 రాయితీ బ్యాంకు ఖాతాలో పడుతుంది. సాధారణంగా చమురు సంస్థలు ప్రతి నెల 1వ తేదీన సిలిండర్‌ ధరలను సమీక్షిస్తాయి. ఈసారి దాదాపు రెండువారాలు ఆలస్యమైంది. 


ప్రజల జేబులకు షాక్‌: విపక్షాలు 

వంటగ్యాస్‌ సిలిండర్‌ ధర పెంపుపై కాంగ్రెస్‌ సహా ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి. ధరల పెంపుద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రజల జేబులకు కరంటుషాక్‌ ఇచ్చిందని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి సుర్జేవాలా విమర్శించారు. ఏడాది కాలంలో సిలిండర్‌ ధరను రూ.200 వరకు పెంచారని చెప్పారు. ధరల పెంపును నిరసిస్తూ గురువారం దేశవ్యాప్త ఆందోళనలకు ఆలిండియా మహిళా కాంగ్రెస్‌ పిలుపునిచ్చింది. మరోవైపు బీఎస్పీ అధినేత్రి మాయావతి తాజా ధరల పెంపును పేదలకు వ్యతిరేకంగా తీసుకున్న ‘క్రూరమైన నిర్ణయం’గా అభివర్ణించారు.


logo
>>>>>>