శనివారం 04 ఏప్రిల్ 2020
National - Feb 22, 2020 , 02:18:45

అమూల్యపై దేశద్రోహం కేసు

అమూల్యపై దేశద్రోహం కేసు
  • 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ
  • నా కూతురుది క్షమించరాని తప్పు: అమూల్య తండ్రి
  • ఆమెకు నక్సలైట్లతో సంబంధాలున్నాయి: యెడియూరప్ప
  • అమూల్య నినాదాలపై స్నేహితురాళ్ల్ల మరో వాదన

బెంగళూరు, ఫిబ్రవరి 21: పౌరసత్వ సవరణ చట్టానికి(సీఏఏ) వ్యతిరేకంగా గురువారం బెంగళూరులో నిర్వహించిన ఓ సభలో పాకిస్థాన్‌కు అనుకూలంగా నినాదాలు చేసిన అమూల్య లియోనాపై పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేశారు. ఆమెకు 14 రోజులపాటు జ్యుడీషియల్‌ కస్టడీ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసినట్టు శుక్రవారం పోలీసులు తెలిపారు. ‘రాజ్యాంగాన్ని కాపాడుదాం’ పేరిట గురువారం బెంగళూరులో సీఏఏను వ్యతిరేకిస్తూ నిర్వహించిన సభలో అమూల్య అనే యువతి ‘పాకిస్థాన్‌ జిందాబాద్‌' అంటూ మూడుసార్లు నినాదాలు చేయడం కలకలం రేపింది. మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ సభలో ఉండగానే ఈ పరిణామం చోటుచేసుకున్నది. దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. 


ఆ తర్వాత ఆమెపై దేశద్రోహం కేసు నమోదు చేసిన పోలీసులు..  అరెస్టు చేసి మెజిస్ట్రేట్‌ న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు. దీంతో కోర్టు ఆమెకు 14 రోజులపాటు జ్యుడీషియల్‌ కస్టడీ విధిస్తూ ఆదేశాలు జారీ చేసిందని పోలీసులు తెలిపారు. మరోవైపు, పాకిస్థాన్‌కు అనుకూలంగా నినాదాలు చేసిన అమూల్యను లక్ష్యంగా చేసుకుంటూ చిక్కమంగళూరులోని ఆమె నివాసంపై గురువారం సాయంత్రం కొందరు గుర్తుతెలియని వ్యక్తులు దాడులకు పాల్పడ్డారని, దీంతో ఇంట్లోని కిటికీల అద్దాలు పగిలిపోయాయని.. ఈ క్రమంలో అక్కడ భద్రతను ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. దాడులకు పాల్పడిన వాళ్లు మితవాద కార్యకర్తలుగా అనుమానిస్తున్నారు. ఇంకోవైపు, అమూల్య వ్యాఖ్యలను నిరసిస్తూ శుక్రవారం నగరవ్యాప్తంగా పలు సంస్థలు నిరసనలు చేపట్టాయి.


అసలు విషయాలు బయటకు వస్తాయి

అమూల్య వ్యాఖ్యలను కర్ణాటక సీఎం యెడియూరప్ప ఖండించారు. ఇలాంటి ఘటనలతో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు కొన్ని సంస్థలు కుట్ర పన్నుతున్నాయని ఆయన ఆరోపించారు. మైసూరులో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఈ ఘటనపై మరింత లోతుగా ఆరా తీస్తే అసలు విషయాలు బయటకు వస్తాయి. గతంలో ఆమెకు నక్సలైట్లతో సంబంధాలు ఉన్నట్టు స్పష్టమైంది. ఆమె తండ్రి కూడా ఆమెను శిక్షంచాలని, బెయిల్‌ కూడా ఇవ్వొద్దని కోరుతున్నారు’ అని తెలిపారు.


పొరుగుదేశాలన్నింటికీ  జిందాబాద్‌!

ఈనెల 16న అమూల్య ఫేస్‌బుక్‌లో పోస్టు చేసిన వీడియో ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నది. అందులో ఆమె భారత్‌ పొరుగు దేశాల పేర్లు చెబుతూ జిందాబాద్‌ అని నినదించడం ఉన్నది. గురువారం జరిగిన సభలో కూడా అమూల్య మిగతా దేశాలకు కూడా జిందాబాద్‌ చెప్పే లోపునే, ఆమెను అక్కడున్న వాళ్లు అడ్డుకున్నారని ఆమె స్నేహితురాళ్లు కొందరు చెబుతున్నారు.


నా బిడ్డను శిక్షించండి


‘పాకిస్థాన్‌ జిందాబాద్‌' అంటూ నినాదాలు చేసి తన కూతురు క్షమించరాని తప్పు చేసిందని అమూల్య తండ్రి వాజీ పేర్కొన్నారు. ‘అది క్షమించరాని తప్పు. ఆ మాటలతో తను భారతీయులను గాయపర్చింది. చట్టం ప్రకారం తనపై చర్యలు తీసుకోవాలి. తనకు ఇప్పుడు 19 ఏండ్లు. తనెందుకు అలా అన్నదో, తన వెనుక ఎవరు ఉన్నారో తెలుసుకోవాలి’ అని అన్నారు. అమూల్య చురుకైన అమ్మాయి అని, సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా జరిగే నిరసనల్లో పాల్గొనొద్దని, చదువుపై దృష్టిసారించాలని తనకు ఇదివరకే చాలాసార్లు చెప్పానని వాజీ తెలిపారు.


logo