చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నివాసం ముందు ఇవాళ ఓ వ్యక్తి తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకునే ప్రయత్నం చేశాడు. ఆత్మహత్యకు ప్రయత్నించిన ఆ వ్యక్తిని 48 ఏళ్ల వెట్రిమారన్‌గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. సీఎం నివాసం ముందు విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు అతన్ని రక్షించారు. దాదాపు 40 శాతం మేరకు అతని శరీరం కాలిపోయింది. అతన్ని కిల్పౌక్ మెడికల్ కాలేజీలో చేర్పించారు. రూరల్ లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించిన ఓ అంశంలో వెట్రిమారన్ మనస్తాపంతో ఉన్నారు. నామినేషన్ల అంశంలో డిప్రెషన్‌కు గురైన అతను తన విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశాడు.