ఆదివారం 07 జూన్ 2020
National - Apr 03, 2020 , 17:14:41

బ్లాక్‌లిస్ట్‌లో తబ్లిగీ విదేశీయులు..960 వీసాలు రద్దు

బ్లాక్‌లిస్ట్‌లో తబ్లిగీ విదేశీయులు..960 వీసాలు రద్దు

-బ్లాక్‌లిస్ట్‌లో తబ్లిగీ విదేశీయులు..  

-విదేశీ, విపత్తు చట్టాల ఉల్లంఘనపై చర్యలు

-రాష్ట్రాల డీజీపీలకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు.. 

-క్వారంటైన్‌లో 9,000 మంది

న్యూఢిల్లీ: తబ్లిగీ జమాత్‌ కార్యక్రమాల్లో పాల్గొన్న 960 మంది విదేశీయులను కేంద్ర ప్రభుత్వం బ్లాక్‌లిస్ట్‌లో చేర్చింది. వీరి వీసాలను రద్దు చేయడంతోపాటు విదేశీ చట్టం, విపత్తు నిర్వహణ చట్టం ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించింది. పర్యాటక వీసాల కింద భారత్‌కు వచ్చిన వీరు మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొన్నారని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో వీసా నిబంధనలు ఉల్లంఘించినందుకు భారత వీసాలను రద్దు చేయడంతోపాటు వారిని బ్లాక్‌లిస్ట్‌లో చేర్చినట్లు తెలిపింది. విదేశీ చట్టం, విపత్తు నిర్వహణ చట్టాన్ని ఉల్లంఘించిన 960 మంది తబ్లిగీ విదేశీయులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులతోపాటు వారు ప్రస్తుతం ఉన్న రాష్ర్టాల డీజీపీలను ఆదేశించినట్లు వెల్లడించింది. దేశవ్యాప్తంగా సుమారు 9 వేల మంది తబ్లిగీ సభ్యులు, వారు తొలుత కలిసిన వారిని క్వారంటైన్‌లో ఉంచినట్లు కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి పుణ్యసలిల శ్రీవాస్తవ తెలిపారు. ఇందులో 1,306 మంది విదేశీయులు ఉన్నట్లు తెలిపారు. ఢిల్లీలోని 2000 మంది జమాత్‌ సభ్యుల్లో 1,804 మందిని క్వారంటైన్‌కు తరలించాలమని, వైరస్‌ లక్షణాలున్న 334 మందిని దవాఖానల్లో చేర్చామని ఆమె వివరించారు. వైరస్‌ వ్యాప్తిపై తప్పుడు వార్తలు, వదంతుల నియంత్రణకు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఓ ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. వార్తల్లోని వాస్తవాలను గుర్తించే ఫ్యాక్ట్‌ చెక్‌ యూనిట్‌ (ఎఫ్‌సీయూ) గురువారం నుంచి అందుబాటులోకి వచ్చిందని, ప్రజలు [email protected] కు మెయిల్‌ చేసి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చన్నారు. రాష్ర్టాల స్థాయిల్లోనూ ఇలాంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించామన్నారు. 

స్వీయనిర్బంధంలో ఉన్నా: జమాత్‌ నేత 

వైద్యుల సలహా మేరకు తాను స్వీయ క్వారంటైన్‌లో ఉన్నట్లు తబ్లిగీ జమాత్‌ నేత మౌలానా సాద్‌ కంధల్వి తెలిపారు. ఈ సంక్షోభ సమయంలో ప్రభుత్వానికి సహాయసహకారాలను అందించాలని, అధికారులు, వైద్యుల సూచనలు పాటించాలని జమాత్‌ సభ్యులకు పిలుపునిచ్చారు. ఈ జాగ్రత్త చర్యలు మత విశ్వాసాలకు ఏ మాత్రం వ్యతిరేకం కాదన్నారు. మానవుల పాపాల వల్లే మహమ్మారి వచ్చిందన్న సాద్‌, విముక్తి, మానవ జాతి రక్షణ కోసం అల్లాను ప్రార్థించాలని వారికి సూచించారు. ఈ మేరకు ఓ ఆడియో సందేశాన్ని విడుదల చేశారు. 

నిజాముద్దీన్‌ ప్రాంతంలో శుద్ధి చర్యలు

నిజాముద్దీన్‌ ప్రాంతంలో వైరస్‌ నిర్మూలన చర్యలను ఢిల్లీ ఫైర్‌ సర్వీస్‌ (డీఎఫ్‌ఎస్‌) చేపట్టింది. ఆ ప్రాంతంలో 20 వేల లీటర్ల రసాయన మందును పిచికారి చేసినట్లు డీఎఫ్‌ఎస్‌ డైరెక్టర్‌ అతుల్‌ గార్గ్‌ తెలిపారు.


logo