గురువారం 02 జూలై 2020
National - Jun 21, 2020 , 15:14:54

53 ఏళ్ల వ‌య‌సులో త‌ప్పిపోయింది.. 40 ఏళ్ల త‌ర్వాత కుటుంబాన్ని క‌లుసుకుంది

53 ఏళ్ల వ‌య‌సులో త‌ప్పిపోయింది.. 40 ఏళ్ల త‌ర్వాత కుటుంబాన్ని క‌లుసుకుంది

భోపాల్ : ఓ మ‌హిళ త‌న‌కు 53 ఏళ్ల వ‌య‌సు ఉన్న‌ప్పుడు త‌ప్పిపోయింది. స‌రిగ్గా 40 ఏళ్ల త‌ర్వాత ఆ వృద్ధురాలు త‌న కుటుంబ స‌భ్యుల‌ను క‌లుసుకుంది. అయితే 40 ఏళ్ల పాటు చేర‌దీసిన కుటుంబం.. ఆమె త‌న సొంతింటి కుటుంబ స‌భ్యుల వ‌ద్ద‌కు వెళ్తుంటే.. క‌న్నీరు పెట్టుకుంది. 

నాగ్ పూర్ కు చెందిన పంచుభాయి(93) త‌న‌కు 53 ఏళ్ల వ‌య‌సున్న‌ప్పుడు.. ఇంటి నుంచి అదృశ్య‌మైంది. అలా దారి పొడవునా వెళ్తుంటే.. మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోని దామోహ్ జిల్లాలోని కోట త‌లా గ్రామంలో ఆమెను తేనేటీగ‌లు చుట్టుముట్టాయి. ఈ విష‌యాన్ని గ‌మ‌నించిన నూర్ ఖాన్ అనే వ్య‌క్తి.. పంచుభాయిని చేర‌దీసి త‌న ఇంటికి తీసుకెళ్లాడు. ఆమెకు కేవ‌లం మ‌రాఠీ మాత్ర‌మే రావ‌డంతో.. సొంతూరిని క‌నుగొన‌డంలో విఫ‌ల‌మ‌య్యారు. మొత్తానికి నూర్ ఖాన్ త‌న ఇంటి మ‌నిషిగా ఆమెను చూసుకున్నాడు. 

అయితే 2007లో నూర్ ఖాన్ మ‌ర‌ణించాడు. అప్ప‌ట్నుంచి ఆమె బాగోగుల‌ను ఖాన్ కుమారుడు ఇసార్ ద‌గ్గ‌రుండి చూసుకుంటున్నాడు. అయితే గ‌త నెల 3వ తేదీన పంచుభాయిని ఆమె గ‌తం గురించి అడిగాడు. ఆమె పూర్వీకుల గురించి కనుగొనే ప్ర‌య‌త్నం చేశాడు. కానీ కేవ‌లం ఆమె రెండు ప‌దాలు మాత్ర‌మే చెబుతుంది. అవేంటంటే.. ఖాన్జ‌న్మ‌, ప‌థ్రోట్. ఈ రెండు ప‌దాల‌ను గూగుల్ లో సెర్చ్ చేయ‌గా.. ప‌థ్రోట్.. నాగ్ పూర్ లోని ఓ గ్రామంగా తెలిసింది. దీంతో ఇసార్.. దీని ఆధారంగా ఆమె పూర్వీకుల‌ను క‌నుగొన్నాడు.

కొద్ది గంట‌ల్లోనే ఆమె కుటుంబ స‌భ్యుల వివ‌రాల‌ను ఇసార్ సేక‌రించాడు. ఆ త‌ర్వాత పంచుభాయి ఫోటోల‌ను వారికి వాట్సాప్ ద్వారా పంపాడు. మొత్తానికి ఆమెను త‌మ కుటుంబ స‌భ్యురాలిగా నిర్ధారించుకున్న‌ వారు ఇసార్ ఇంటికి చేరుకున్నారు. పంచుభాయి మ‌నువ‌డు పృథ్వీ కుమార్ సింగేల్.. త‌న కారులో కోట‌త‌లా గ్రామానికి చేరుకుని పంచుభాయిని చూసి ఆనంద భాష్పాలు రాల్చాడు. 

ఇక పంచుభాయి నాగ్ పూర్ కు బయ‌ల్దేరే ముందు.. ఇసార్ కుటుంబ స‌భ్యులు భావోద్వేగానికి లోన‌య్యారు. ఓ మ‌హిళ‌.. ఆమెను హ‌త్తుకుని క‌న్నీరు పెట్టుకున్నారు. అక్క‌డున్న మ‌హిళ‌లంతా ఒక్క‌సారిగా విల‌పించారు. ఒక‌రైతే ఆమెకు దండ వేసి ఘ‌నంగా వీడ్కోలు ప‌లికారు.


logo