శనివారం 15 ఆగస్టు 2020
National - Mar 26, 2020 , 14:43:30

ఢిల్లీ బస్తీ దవాఖానకు సౌదీ మహిళ.. 900 మంది క్వారంటైన్

ఢిల్లీ బస్తీ దవాఖానకు సౌదీ మహిళ.. 900 మంది క్వారంటైన్

-సౌదీ నుంచి వచ్చిన మహిళ కారణం - డాక్టరుతోపాటు పలువురికి కరోనా

హైదరాబాద్: దేశరాజధాని ఢిల్లీలో బస్తీ దవాఖాన నడిపే ఓ డాక్టరుకు కరోనా సోకడంతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది. ఆయన భార్యకు, టీనేజీ కూతురికి పరీక్షలు జరిపితే వారికీ పాజిటివ్ వచ్చింది. మరో వ్యక్తికి కూడా కరోనా ఉన్నట్టు తేలింది. దాంతో ఆయన క్లినిక్‌ను సందర్శించిన సుమారు 

900 మందిని క్వారంటైన్ చేశారు. ఢిల్లీ ఆరోగ్యమంత్రి సత్యేందర్ జైన్ ఈ సంగతి వెల్లడించారు. 14 రోజుల పాటు అనుమానితులకు క్వారంటైన్ కొనసాగుతుంది. సౌదీ అరేబియా నుంచి వచ్చిన ఓ మహిళ మార్చి 12న ఆ బస్తీ దవాఖానాను సందర్శించడమే ఈ కరోనా గొలుసుకట్టు వ్యాప్తికి 

కారణమని తెలిసింది. కోవిడ్-19 లక్షణాలతో వచ్చిన ఆ మహిళకు డాక్టరు చికిత్స జరిపి పంపారు. ఆ తర్వాత ఐదురోజులకు ఆమెకు కరోనా సోకినట్టు పరీక్షల్లో ఖరారైంది. అదేరోజు డాక్టరుకు పాజిటివ్ వచ్చింది. తర్వాత ఆయన భార్యకు, కూతురికి మరో వ్యక్తికి కరోనా సంక్రమించింది. దీంతో ఢిల్లీ కరోనా 

బాధితుల సంఖ్య 36కు చేరింది. సౌదీ నుంచి వచ్చిన మహిళ కుటుంబానికి చెందిన మరో ఐదుగురు కూడా కరోనా బారినపడ్డారు. బస్తీ దవాఖానాలో కరోనా కలకలం రేపినప్పటికీ వాటిని మూసే ప్రసక్తే లేదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. బస్తీ దవాఖానాలు లేకపోతే పేదలకు 

వైద్యం అందుబాటులో ఉండదని, వారు దూరంగా ఉండే ఖరీదైన ఆస్పత్రులకు పరుగులు తీయాల్సి వస్తుందని ఆయన అన్నారు. సరైన సూచనలతో పేదలు కూడా జాగ్రత్తలు పాటించగలరని ఆయన ధీమా వ్యక్తం చేశారు.


logo