మంగళవారం 20 అక్టోబర్ 2020
National - Sep 20, 2020 , 03:18:44

ఉగ్రకుట్ర భగ్నం!

ఉగ్రకుట్ర భగ్నం!

  • 9 మంది ఆల్‌ఖైదా ఉగ్రవాదుల అరెస్టు
  • కేరళ, పశ్చిమ బెంగాల్‌లో ఎన్‌ఐఏ అదుపులోకి 
  • అమాయక ప్రజలే లక్ష్యంగా పేలుళ్లకు కుట్ర
  • ఢిల్లీతో పాటు కీలక ప్రాంతాల్లో దాడులకు ప్రణాళిక
  • దస్ర్తాలు, డిజిటల్‌ పరికరాలు, జీహాదీ సాహిత్యం స్వాధీనం 

న్యూఢిల్లీ/కోల్‌కతా, సెప్టెంబర్‌ 19: దేశంలో భారీ ఉగ్రదాడులకు కుట్రపన్నిన తొమ్మిది మంది ఆల్‌ఖైదా ఉగ్రవాదులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అరెస్టు చేసింది. కేంద్ర నిఘా వర్గాల నుంచి అందిన సమాచారంతో అప్రమత్తమైన ఎన్‌ఐఏ ఈ భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేసింది. కేరళలోని ఎర్నాకుళంలో, పశ్చిమ బెంగాల్‌లోని ముర్షీదాబాద్‌లో స్థానిక పోలీసుల సహకారంతో శుక్రవారం అర్ధరాత్రి సోదాలు నిర్వహించిన ఎన్‌ఐఏ తొమ్మిది మంది ఉగ్రవాదులను అరెస్టు చేసింది. ముర్షీద్‌ హసన్‌, యాకూబ్‌ బిస్వాస్‌, మొసారఫ్‌ హొసెన్‌ను కేరళలోని ఎర్నాకుళంలో నజ్‌ముస్‌ సకిబ్‌, అబు సిఫియాన్‌, మైనూల్‌ మోండల్‌, లియూ యీన్‌ అహ్మద్‌, ఆల్‌ మమూన్‌ కమల్‌, అతితూర్‌ రహ్మాన్‌ను పశ్చిమ బెంగాల్‌ని ముర్షీదాబాద్‌లో అదుపులోకి తీసుకున్నట్టు ఎన్‌ఐఏ ప్రతినిధి ఒకరు తెలిపారు. 

సోషల్‌ మీడియా వేదికగా..

ఆల్‌ఖైదా గ్రూపుకు చెందిన ఈ ఉగ్రవాదులు రానున్న వారాల్లో దేశంలోని జనసమ్మర్థ ప్రదేశాల్లో పలు బాంబు పేలుళ్లు, మారణ హోమాలు సృష్టించి అమాయకుల ప్రాణాలను బలితీసుకునే కుట్ర పన్నినట్టు  ఎన్‌ఐఏ అధికారి ఒకరు తెలిపారు. అరెస్టయిన తొమ్మిది మంది పాకిస్థాన్‌కు చెందిన ఆల్‌ఖైదాలో సోషల్‌ మీడియా వేదికల ద్వారా చేరారని వివరించారు.

నెట్‌వర్క్‌ విస్తరణ

దేశంలో ఆల్‌ఖైదా స్థావరాన్ని ఏర్పాటు చేసేందుకు ముఖ్యంగా ఈశాన్య భారత్‌, జమ్ముకశ్మీర్‌లో ఆల్‌ఖైదా నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు ఈ బృందం ప్రయత్నించినట్టు అధికారులు తెలిపారు. నిందితుల నుంచి దస్ర్తాలు, డిజిటల్‌ పరికరాలు, జీహాదీ సాహిత్యం, దేశీయంగా తయారైన తుపాకీలు, పదునైన ఆయుధాలు, స్థానికంగా తయారైన శరీర రక్షణ కవచాలు, పేలుడు సామగ్రిని ఎన్‌ఐఏ స్వాధీనం చేసుకుంది. మరోవైపు, అక్రమ బాంబుల తయారీకి బెంగాల్‌ అడ్డాగా మారిందని ఆరాష్ట్ర గవర్నర్‌  జగదీప్‌ ధన్‌కర్‌ మమత సర్కారుపై నిప్పులు చెరిగారు.

ఉగ్రవాదులకు డ్రోన్లతో ఆయుధాలు ముగ్గురి అరెస్ట్‌ 

జమ్ము: కశ్మీర్‌ ఉగ్రవాదులకు పాకిస్థాన్‌ కేంద్రంగా పని చేస్తున్న ఉగ్రవాద సంస్థలు డ్రోన్ల ద్వారా జమ్ముకశ్మీర్‌లోని సరిహద్దుల్లో ఆయుధాలు, డబ్బును జార విడుస్తున్నాయని జమ్ముకశ్మీర్‌ డీజీపీ దిల్బాగ్‌ సింగ్‌ శనివారం మీడియాకు తెలిపారు. పుల్వామా జిల్లా నుంచి రాజౌరి జిల్లాలో నియంత్రణ రేఖ (ఎల్వోసీ) సమీపాన ఆయుధాలు తీసుకునేందుకు వచ్చిన ముగ్గురు లష్కరే తాయిబా ఉగ్రవాదులను శుక్రవారం జమ్ముకశ్మీర్‌ పోలీసులు అరెస్ట్‌ చేయడంతో ఈ సంగతి బయటపడింది.


logo