సోమవారం 01 జూన్ 2020
National - May 08, 2020 , 10:28:03

క‌రోనా వ‌ల్ల 85 శాతం రోజువారి కూలీల‌పై ప్ర‌భావం:ఐఐఎం

క‌రోనా వ‌ల్ల 85 శాతం రోజువారి కూలీల‌పై ప్ర‌భావం:ఐఐఎం

అహ్మ‌దాబాద్‌:  కోవిడ్‌-19 కార‌ణంగా దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. రోజువారి కూలీల‌పై లాక్‌డౌన్ ఎంత మేర‌కు ప్ర‌భావం చూపిస్తుంద‌న్న విష‌యంపై ఇండియ‌న్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అహ్మ‌దాబాద్ ప‌ట్ట‌ణంలో స‌ర్వే నిర్వ‌హించింది. 85శాతం మంది రోజువారి కూలీలపై లాక్‌డౌన్ ప్ర‌భావం చూపించిందని స‌ర్వేలో తేలింది. ఇండియాలో క‌రోనా వైర‌స్ ప్రారంభ‌మైన మార్చి నెల నుంచి దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ కార‌ణంగా నైపుణ్యం లేని కార్మికులను, రోజువారీ కూలీల‌ను నిరుద్యోగులుగా మార్చింది. 

న‌గ‌రంలోని 500 ఇండ్ల‌లో నిర్వ‌హించిన స‌ర్వే ప్ర‌కారం వీరంతా లాక్‌డౌన్‌కు ముందు నెల‌కు రూ.19500 క‌న్నా త‌క్కువ సంపాదించేవారు. లాక్‌డౌన్ కార‌ణంగా వారికి నిత్యం వ‌చ్చే ఆదాయం కోల్పోయిన‌ట్లు స‌ర్వే డేటా వెల్ల‌డించింది. ఇప్పుడు నెల‌కు రూ.4 వేల నుంచి 6 వేలు మాత్ర‌మే ఆదాయం వ‌స్తుంద‌ని తేలింది. 500 కుటుంబాలో 54 శాతం మంది రోజుకు మూడు పూట‌లా భోజ‌నంకు బ‌దులుగా రెండుపూట‌లు మాత్ర‌మే ఆహారం తీసుకుంటున్న‌ట్లు తెలిపారు. 

60 శాతం కుటుంబాలు త‌మ‌కు త‌గినంత రేష‌న్ లేక ఒక్క‌పూట మాత్ర‌మే భోజ‌నం చేస్తున్న‌ట్లు తెలిపాయి. మార్చి 24వ తేదీ నుంచి ఏప్రిల్ 9వ తేదీ వ‌ర‌కు బ‌స్సు, ఆటోరిక్షా డ్రైవ‌ర్లు, రోజు వారీ కూలీలు, ఫ్లంబ‌ర్లు, కూర‌గాయ‌ల అమ్ముకునే వారి కుటుంబాల్లో ఈ స‌ర్వే నిర్వ‌హించారు. వీరంతా రోజువారి ఆదాయంపై బ్ర‌తికే వారే. ప్రొఫెస‌ర్ అంకూర్ స‌రీస్ నేతృత్వంలోని ఐఐఎం-ఏ ప‌రిశోధ‌కుల బృదం ఈ అధ్య‌య‌నం నిర్వ‌హించింది. 


logo