బుధవారం 27 మే 2020
National - May 07, 2020 , 07:38:51

154 మంది బీఎస్‌ఎఫ్‌ జవాన్లకు కరోనా పాజిటివ్‌

154 మంది బీఎస్‌ఎఫ్‌ జవాన్లకు కరోనా పాజిటివ్‌

న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. ఇప్పటి వరకు 154 మంది బీఎస్‌ఎఫ్‌ జవాన్లకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు అధికారులు వెల్లడించారు. కరోనా సోకిన జవాన్లు అందరూ శాంతి భద్రతల పర్యవేక్షణలో ఉన్నవారేనని అధికారులు చెప్పారు. దేశ రాజధాని ఢిల్లీలోని జామియా, చాందినీమహల్‌లో మార్చి నెలలో 60 మంది సైనికులు శాంతి భద్రతల పర్యవేక్షణలో ఉన్నారు. వీరికి అక్కడున్న స్థానికుల నుంచి కరోనా వ్యాపించింది. వీరిలో 30 మందిని జోధ్‌పూర్‌లోని ఐసోలేషన్‌ వార్డుకు తరలించారు. మిగతావారిని గ్రేటర్‌ నోయిడాలోని సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీసు ఫోర్సెస్‌ రిఫరల్‌ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. 

పశ్చిమ బెంగాల్‌కు వెళ్లిన కేంద్ర బృందానికి రక్షణగా వెళ్లిన ఆరుగురు జవాన్లకు కూడా కరోనా వైరస్‌ వ్యాప్తి చెందింది. ఈ బృందం బెంగాల్‌లోని కంటైన్‌మెంట్‌ జోన్ల పరిధిలో పర్యటించింది. ఈ ఆరుగరు జవాన్లను ఐసోలేషన్‌ వార్డులకు తరలించారు. 

ఇండియా - బంగ్లాదేశ్‌ సరిహద్దులో త్రిపుర వద్ద విధులు నిర్వహిస్తున్న 37 మంది సైనికులకు కరోనా సోకింది. అయితే ఈ 37 మంది సైనికులకు మరో సైనికుడి ద్వారా కరోనా వ్యాపించినట్లు అధికారులు నిర్ధారించారు. 

ఢిల్లీలోని బీఎస్‌ఎఫ్‌ హెడ్‌క్వార్టర్స్‌లోని అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌ సిబ్బందిలోని ఓ జవానుకు కరోనా సోకడంతో.. ఆ క్వార్టర్స్‌ను మూసివేశారు. ఆ భవనాన్ని మొత్తం శానిటైజ్‌ చేస్తున్నారు. భవనంలోని రెండో అంతస్తును బుధవారం వరకు తెరవలేదు. 


logo