శుక్రవారం 30 అక్టోబర్ 2020
National - Aug 05, 2020 , 02:07:25

28 ఏండ్లుగా దీక్ష భోజనం మానేసి పండ్లు, పాలు

28 ఏండ్లుగా దీక్ష భోజనం మానేసి పండ్లు, పాలు

జబల్‌పూర్‌: రామమందిర నిర్మాణం కోసం ఆమె ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 28 ఏండ్లుగా ఎదురుచూస్తున్నారు. ఆలయ నిర్మాణ స్వప్నం సాకారం కానంతవరకూ భోజనం చేయనని ప్రతిజ్ఞ చేశారు. అప్పటి నుంచీ ఇప్పటి వరకూ కేవలం పాలు, పండ్లు తీసుకుంటూ జీవిస్తున్నారు. ఆమె పేరు ఊర్మిళాదేవి. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌ వాసి. వయస్సు 82 ఏండ్లు. 1992లో బాబ్రీమసీదును కూల్చివేత అనంతరం దేశవ్యాప్తంగా చెలరేగిన ఘర్షణలు, రక్తపాతం ఆమె మనస్సును కలిచివేశాయి. మందిరం సమస్య సామరస్యపూర్వకంగా పరిష్కారమై అయోధ్యలో రామమందిరం నిర్మించేవరకు భోజనం ముట్టను అని తీర్మానించుకున్నారు. అప్పుడామె వయస్సు 54 ఏండ్లు. అప్పటికే వృద్ధాప్యంలోకి ప్రవేశించినప్పటికీ.. ఆమె దీక్ష సడలలేదు. నేటికీ పాటిస్తున్నారు. ప్రస్తుతం రామాలయం నిర్మాణానికి భూమిపూజ జరుగుతున్న నేపథ్యంలో.. పూజ అనంతరం అయోధ్య నుంచి వచ్చిన ప్రసాదాన్ని తీసుకున్న తర్వాత తన దీక్షను విరమించి భోజనం చేస్తానని చెప్పారు ఊర్మిళాదేవి.