మనలో కసి ఉండాలి.. పట్టుదల ఉండాలి కానీ.. వయసుతో పని లేదు అని నిరూపిస్తోంది ఈ బామ్మ. ఈమె వయసు ఎంతో తెలుసా? అక్షరాల 80 సంవత్సరాలు. ఈ వయసు వరకు మనం బతుకుతామో లేదో కూడా డౌటే. కానీ.. ఈ బామ్మ ఈ వయసులో కృష్ణా రామా అంటూ కాటికి కాళ్లు చాపి ఇంట్లో కూర్చోలేదు. ఈ వయసులో జ్యూస్ స్టాల్ పెట్టి తన కాళ్ల మీద తాను నిలబడింది. నిజానికి తను ఈ వయసులో కూడా కష్టపడి పని చేస్తేనే తనకు మూడు పూటలా తిండి వస్తుంది. లేదంటే తనకు ఫుడ్డు ఉండదు. అందుకే.. తను ఈ వయసులో ఇంత కష్టపడాల్సి వస్తోంది.
అమృత్ సర్ లో రాణి దా బాగ్ దగ్గర బామ్మ జ్యూస్ స్టాల్ పెట్టి తన బతుకు బండిని లాగుతోంది. బామ్మ జ్యూస్ అమ్మడం చూసిన ప్రముఖ యూట్యూబర్ గౌరవ్ వాసన్ వెంటనే ఆమె జ్యూస్ స్టాల్ వీడియో తీసి తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేశాడు. ఇక చూసుకోండి.. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
మీకు గుర్తుందా? గత సంవత్సరం కూడా ఢిల్లీలో బాబా కా దాబా అనే చిన్న కాకా హోటల్ కు కస్టమర్లు రావడం లేదని.. ఆ హోటల్ యజమాని ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ ఉన్న ఒక వీడియో వైరల్ అయింది కదా. ఆ వీడియోను షేర్ చేసింది కూడా ఈయనే. అప్పట్లో ఆ వీడియో సంచలనం సృష్టించింది. అక్కడ ఫుడ్డు కూడా బాగుంటుందని.. అందరూ అక్కడికి వెళ్లి తినాలని చెప్పడంతో.. అక్కడి స్థానికులు ఆ హోటల్ కు భారీ క్యూ కట్టారు. దీంతో ఆ హోటల్ తెగ ఫేమస్ అయిపోయింది.
తాజాగా.. ఈ బామ్మ జ్యూస్ స్టాల్ వీడియోను కూడా వాసన్ పోస్ట్ చేయడంతో.. నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయ్యో బామ్మ.. ఈ వయసులో నీకు ఇంత కష్టం వచ్చిందా? తన బ్యాంక్ అకౌంట్ డిటెయిల్స్ తెలిస్తే పంపించండి. తనకు సాయం చేస్తాం.. అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.