మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 04, 2020 , 04:07:33

పోలీసుపైకి రౌడీ తూటా

పోలీసుపైకి రౌడీ తూటా

డీఎస్పీ, ముగ్గురు ఎస్‌ఐలు సహా 8మంది మృతి

యూపీలోని బిక్రూలో రౌడీ షీటర్ల ఘాతుకం

గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దూబే  అరెస్టుకు వెళ్తుండగా పోలీసులపైకి కాల్పులు

కాన్పూర్‌: ఓ గ్యాంగ్‌స్టర్‌ను అరెస్టు చేయడానికి పోలీసులు వెళ్లారు. ఈ విషయం ముందే తెలుసుకున్న రౌడీలు వారిని అడ్డుకున్నారు. ఎటూ పోకుండా దిగ్బంధించారు. పోలీసులపై తుపాకీ గుళ్ల వర్షం కురిపించారు. అనంతరం పోలీసుల దగ్గర నుంచి ఆయుధాలను ఎత్తుకెళ్లిపోయారు. క్రైమ్‌ థ్రిల్లర్‌ సినిమా కథను కూడా తలదన్నే ఈ ఘటన యూపీలో కాన్పూర్‌ సమీపంలోని బిక్రూ గ్రామంలో నిజంగా జరిగింది. 60 కేసుల్లో నిందితుడిగా ఉన్న గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దూబేను అరెస్టు చేసేందుకు డీఎస్పీ దేవేంద్ర మిశ్రా సహా 16 మంది పోలీసుల బృందం గురువారం అర్ధరాత్రి వెళ్లింది. విషయం తెలుసుకున్న ఆ రౌడీలు ముందే మాటువేశారు. పోలీసుల వాహనం వెళ్తున్న దారిలో జేసీబీని అడ్డుగా పెట్టారు. వారు కిందకి దిగగానే భవనాలు, ఇండ్లపై నుంచి విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో దేవేంద్ర మిశ్రా సహా 8మంది పోలీసులు చనిపోయారు. వీరిలో ముగ్గురు ఎస్‌ఐలు, నలుగురు కానిస్టేబుళ్లు ఉన్నారు. ఒక సాధారణ పౌరుడు సహా ఏడుగురికి గాయాలయ్యాయి. అనంతరం ఆ రౌడీ షీటర్లు పోలీసుల దగ్గర ఉన్న ఆయుధాలను ఎత్తుకెళ్లారు. ఈ ఘటన గురించి తెలియగానే కాన్పూర్‌ అడిషనల్‌ డీజీపీ జయనారాయణ్‌ సింగ్‌, కాన్పూర్‌ ఐజీ మోహిత్‌ అగర్వాల్‌ పోలీసులు, అధికారులు అక్కడికి చేరుకున్నారు. గ్రామం చుట్టూ పోలీసులు మోహరించారు. సెర్చ్‌ ఆపరేషన్‌ను ప్రారంభించారు. ఈ క్రమంలో శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో వికాస్‌దూబే గ్యాంగ్‌కు చెందిన ఇద్దరు రౌడీలు చనిపోయినట్టు పోలీసులు వెల్లడించారు. వికాస్‌ దూబే కోసం గాలింపు ముమ్మరంగా సాగుతున్నదని తెలిపారు.  2003లో లేబర్‌ కాంట్రాక్ట్‌ బోర్డు చైర్మన్‌ సంతోష్‌ శుక్లాను వికాస్‌ దూబే హత్య చేసినట్టుగా ఆరోపణలున్నాయి. కానీ ఆ కేసు నుంచి అతడు నిర్దోషిగా విడుదలయ్యాడు. కాగా, గ్యాంగ్‌స్టర్‌ ముఠా చేతుల్లో 8 మంది పోలీసులు మరణించడంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మృతుల పట్ల సంతాపం ప్రకటించారు. ‘సాటిలేని ధైర్యసాహసాలతో విధులు నిర్వహిస్తూ అమరులైన పోలీసులను ఉత్తరప్రదేశ్‌ ఎన్నటికీ మర్చిపోదు’ అని ట్వీట్‌ చేశారు.

గూండా రాజ్యానికి నిదర్శనం: రాహుల్‌ 

పోలీసుల మీద రౌడీ మూకల కాల్పుల ఘటనపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశాయి. యూపీలో గూండారాజ్యం నడుస్తున్నదనడానికి ఈ ఘటన ఒక నిదర్శనమని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ అన్నారు. పోలీసులకే రక్షణ లేకపోతే సాధారణ ప్రజల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ప్రియాంక గాంధీ ఆరోపించారు. యోగి పాలనలో ఉత్తరప్రదేశ్‌ ‘హత్యప్రదేశ్‌'గా మారిందని సమాజ్‌వాదీ పార్టీ విమర్శించింది. 


logo