e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 31, 2021
Home Top Slides అష్ట సూత్రావళి

అష్ట సూత్రావళి

అష్ట సూత్రావళి

మూడోవేవ్‌కు ముకుతాడు వేసేందుకు కార్యాచరణ

‘లాన్సెట్‌’లో 21మంది నిపుణుల సూచనలు ఆరోగ్యసేవల వికేంద్రీకరణ, పారదర్శకంగా చికిత్స ధరలు, ప్రచారంలో శాస్త్రీయ సమాచారం, ప్రజల భాగస్వామ్యం..

- Advertisement -

న్యూఢిల్లీ : దేశంలో రెండోదశ సృష్టించిన అల్లకల్లోలం ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతున్నది. అయితే, అజాగ్రత్తగా ఉంటే.. సెకండ్‌వేవ్‌ను మించిన థర్డ్‌వేవ్‌ భారత్‌ను కమ్ముకొనే ప్రమాదముందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. వైరస్‌ కొత్త మ్యుటేషన్లకు లోనవుతున్న నేపథ్యంలో మూడోవేవ్‌ ముప్పును కొట్టిపారేయలేమంటున్నారు. కొత్త కరోనా ఉత్పాతాన్ని ఎదుర్కోవడానికి భారత్‌ అత్యవసరమైన చర్యలు చేపట్టాలని 21 మంది నిపుణులతో కూడిన బృందం ‘లాన్సెట్‌’ వెబ్‌సైట్‌లో హెచ్చరించింది. కరోనా కట్టడికి భారత్‌ చేపట్టవలసిన ముఖ్యమైన ఎనిమిది సూత్రాలను సూచించింది. ఈ బృందంలో బయోకాన్‌ చైర్‌పర్సన్‌ కిరణ్‌ మజుమ్‌దార్‌ షా, ప్రముఖ సర్జన్‌ డాక్టర్‌ దేవిశెట్టి తదితరులు ఉన్నారు.

మహమ్మారి కట్టడికి నిపుణులు సూచించిన ఎనిమిది సూత్రాలు

 1. ఏకరూప వైద్య వ్యవస్థ వద్దు
  అత్యవసర ఆరోగ్య సేవల వ్యవస్థను వికేంద్రీకరించాలి. కరోనా కేసుల సంఖ్య, ఆరోగ్య సేవలు జిల్లా నుంచి మరో జిల్లాకు భిన్నంగా ఉన్నాయి. కాబట్టి అన్నింటికి ఒకేరకమైన వైద్య వ్యవస్థ సరికాదు.
 2. పారదర్శకంగా ధరల విధానం
  అంబులెన్స్‌లు, ఆక్సిజన్‌, అత్యవసర ఔషధాలు, దవాఖానల్లో చికిత్స తదితర అన్ని అత్యవసర ఆరోగ్య సేవలకు సంబంధించి పారదర్శకమైన జాతీయ ధరల విధానం తప్పనిసరిగా ఉండాలి. అత్యవసర వైద్య సేవల కోసమంటూ కొందరు ఎక్కువ మొత్తంలో వసూలు చేస్తున్నారు. దీనిని నియంత్రించాలి. ఇప్పటికే కొన్ని రాష్ర్టాల్లో అమలు చేస్తున్న విధంగా.. దవాఖానల్లో రోగుల చికిత్సకయ్యే ఖర్చులను ఆరోగ్య బీమా పథకాల కిందకు తీసుకురావాలి.
 3. ప్రజలకు అర్థమయ్యే భాషలో వివరాలు
  కరోనాను ఎదుర్కోవటంపై స్పష్టమైన, శాస్త్రీయాధారిత సమాచారం మరింత విస్తృతంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి. దానిని ఆచరణలో పెట్టాలి. అంతర్జాతీయ మార్గదర్శకాలను అనుసరిస్తూ.. హోంఐసోలేషన్‌- చికిత్స, ప్రాథమిక సంరక్షణ, జిల్లా దవాఖానల్లో చికిత్స విధానానికి సంబంధించిన వివరాలను స్థానిక ప్రజలకు అర్థమయ్యే భాషల్లో వివరించాలి.
 4. మానవవనరుల వినియోగం
  ప్రైవేట్‌ రంగంతో పాటు వైద్య వ్యవస్థలోని అన్ని విభాగాల్లో అందుబాటులో ఉన్న మానవవనరులను సంసిద్ధం చేయాలి. ప్రత్యేకించి పీపీఈ కిట్లను వినియోగించే విధానం, శాస్త్రీయ విధానాల వాడకం, రోగుల మానసిక ఆరోగ్యం, బీమా వంటి సేవల కోసం సిబ్బందికి తగిన మార్గదర్శకత్వం చేయాలి.
 5. పకడ్బందీగా వ్యాక్సినేషన్‌
  ప్రాధాన్యత వర్గాలను బట్టి అందుబాటులో ఉన్న వ్యాక్సిన్‌ డోసుల పంపిణీని రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాలి. వ్యాక్సిన్ల సరఫరా మెరుగుపడిన తర్వాత ఈ ప్రక్రియ మరింత పుంజుకుంటుంది. టీకాలు ప్రజల సంపద. కాబట్టి అవి పక్కదారి పట్టకుండా చూడాలి.
 6. పౌరసమాజం పాత్ర
  దేశంలో కొవిడ్‌పై పోరాటంలో సమాజం, ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి. ముంబైలో కరోనా కట్టడిలో అక్కడి పౌర సమాజం గొప్పపాత్ర పోషించింది.
 7. అప్రమత్తంగా యంత్రాంగం
  రాబోయే రోజుల్లో కేసుల తీవ్రత పట్ల జిల్లా యంత్రాంగాన్ని ముందస్తుగా సిద్ధం చేయాలి. కొవిడ్‌ కేసుల సంఖ్య, మరణాల వివరాలు, సమాచార సేకరణ, మోడలింగ్‌లో పారదర్శకత పాటించాలి. పాజిటివ్‌ కేసులు, దవాఖానలో చేరుతున్న రోగులు, మరణాలు, కమ్యూనిటీ స్థాయిలో వ్యాక్సినేషన్‌, చికిత్స నిబంధనలు, దీర్ఘకాలిక ఫలితాల ట్రాకింగ్‌ గురించి ఆరోగ్య వ్యవస్థ సిబ్బందికి ఎప్పటికప్పుడు సమాచారమివ్వాలి.
 8. శ్రామికులకు బాసట
  ఇప్పటికే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చేసినట్టు.. కరోనా కారణంగా జీవనోపాధి కోల్పోయినవారికి నగదు బదిలీ వంటి పథకాలు అమలు చేయాలి. ఆర్థిక రంగం పునరుజ్జీవనం చర్యల్లో భాగంగా.. కాంట్రాక్టులతో సంబంధం లేకుండా కార్మికులు, ఉద్యోగులకు బాసటగా నిలవాలి.
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అష్ట సూత్రావళి
అష్ట సూత్రావళి
అష్ట సూత్రావళి

ట్రెండింగ్‌

Advertisement