జైలులో ఘర్షణ.. 8 మంది ఖైదీలు మృతి

కొలంబో : శ్రీలంక దక్షిణ ప్రావిన్స్‌లోని మహారా కారాగారంలో చోటు చేసుకున్న ఘర్షణల్లో 8 మంది ఖైదీలు ప్రాణాలు కోల్పోగా.. మరో 50 మంది ఖైదీలకు గాయాలయ్యాయి. పరిస్థితిని అదుపు చేసేందుకు జైలు అధికారులు, సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పలుమార్లు గాలిలోకి కాల్పులు కూడా జరిపినట్లు కొలంబో పోలీస్ అధికార ప్రతినిధి డీఐజీ అజిత్ రోహన్ తెలిపారు. ఓ వర్గానికి చెందిన ఖైదీలకు కరోనా సోకడంతో మరో వర్గానికి చెందిన ఖైదీలు ఆదివారం మధ్యాహ్నం జైలు నుంచి పరారయ్యేందుకు యత్నించగా ఘర్షణలు చోటు చేసుకున్నట్లు సమాచారం.
పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు జైలులో సిబ్బందికి సాయంగా కిలానియా ఎస్ఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. ఘటనపై ఆ రాష్ట్ర జైళ్లశాఖ మంత్రి డాక్టర్ సుదర్శినీ ఫెర్నాడోపుల్లే పార్లమెంట్లో స్పందిస్తూ జైళ్ల మంత్రిత్వ శాఖ కార్యదర్శి అధ్యక్షతన స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపిస్తామని తెలిపారు. నేర దర్యాప్తు విభాగం ( సీఐడీ)తో విచారణ జరిపితే ఘటనకు సంబంధించి వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఆమె పేర్కొన్నారు. 8 మంది మృతదేహాలను సమీపంలో రగామా హాస్పటల్‌కు తరలించారు. గాయపడిన 55 మందిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.