సంగీతం ఎంతటి కష్టాన్నైనా మర్చిపోయేలా చేస్తుందంటారు. ఈ మాట నిజం అని నిరూపించాడు ఈ పెద్దాయన. తనకొచ్చిన కష్టాన్నే కాదు జనం మనస్సులోని కష్టాలను కూడా వయోలిన్ తో దూరం చేస్తున్నాడు. అలా ఓ సంగీత అభిమాని మెచ్చి తీసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇంతకీ ఎవరీయన..ఈ వయసులో ఈయనకొచ్చిన కష్టమేంటి అన్న వివరాలు ఆరాతీస్తే మనస్సున ఎవరికైనా సరే కన్నీళ్లు ఆగవు. వైట్ అండ్ వైట్ డ్రస్సులో మెరిసిపోతున్న ఈ పెద్దాయన పేరు స్వపన్ శేట్. బెంగాల్ కి చెందిన స్వపన్ శేట్ వయోలిన్ మాత్రమే కాదు శిల్ప కళాకారుడు, పెయింటర్ కూడా. కొన్నేళ్లుగా ఆయన భార్య గర్భాశయ కేన్సర్ తో బాధపడుతోంది. ట్రీట్ మెంట్ కి కావాల్సినంత డబ్బులు లేవు. దాంతో తను నమ్ముకొన్న వయోలిన్ నే ఆధారంగా చేసుకున్నాడు.
షాపింగ్ మాల్స్, జన సమ్మూహం ఎక్కువగా ఉన్న ఏరియాల్లో వయోలిన్ వాయిస్తూ విరాళాలు సేకరిస్తున్నాడు. అలా వచ్చిన సంపాదనతో భార్యకి ట్రీట్ మెంట్ చేయిస్తున్నాడు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నా కుటుంబపోషణ కోసం వయోలిన్ తో నలుగురిని ఆనందపరుస్తూనే ఉన్నాడు.