శనివారం 04 ఏప్రిల్ 2020
National - Mar 14, 2020 , 11:31:35

మంచి పుస్తకాన్ని చదివించడం కోసం గడపగడపకూ..

మంచి పుస్తకాన్ని చదివించడం కోసం గడపగడపకూ..


సాంకేతికత కారణంగా పుస్తకాలు కరువయ్యాయి. ఎంతమంచి పుస్తకమైనా ఆన్లైన్లో దొరుకుతుంది కానీ.. దానిని చదివేవారు ఎంతమంది? పుస్తకాలు చదివేవారు కనుమరుగయ్యారని ఇటీవల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే పుస్తక పఠనాసక్తిని పెంచడానికి ఈ వృద్ధురాలు గడపగడపకూ వెళ్తున్నది. 

తెల్లని చీర కట్టుకొని.. భుజానికి బ్యాగు తగిలించుకొని ఏడుపదుల వయసులో కూడా రోజూ 4 కిలోమీటర్ల దూరం నడుస్తున్నదీ మహిళా. ‘ఎందుకమ్మ నీకు ఈ వయసులో ఇంత ప్రయాస’ అంటే.. ‘ఈ నడక నాకోసం కాదు బాబు.. మంచి పుస్తకాన్ని చదివించడం కోసం..’ అంటున్నది కేరళకు చెందిన ఉమాదేవి.

ఈమె ప్రయత్నం తనకోసం కాదు.. రేపటితరం కోసం. టెక్నాలజీ ముసుగులో ఈ తరం ఏం కోల్పోతున్నారో చెప్పేందుకు ఉమాదేవి కేరళలోని ప్రతిగడపూ తట్టేందుకు సిద్ధమైంది. బుద్ధన్నూర్ గ్రామానికి చెందిన ఉమాదేవికి ఓ లైబ్రరీ ఉంది. అందులో అన్నిరకాల సబ్జెక్ట్స్, పురాణాలు, ఎన్నో సందేశాత్మక కథలు, సమాజాన్ని కదిలించే పుస్తకాలున్నాయి. కాకపోతే వాటిని చదివేవారే లేరు. అందుకే లైబ్రరీలోని పుస్తకాలను బ్యాగులో పెట్టుకొని తన చుట్టుపక్కల గ్రామాల్లోవారికి చేరవేస్తున్నది. ఇందుకు ప్రతిగడపలో అడుగు పెడుతున్నది ఉమాదేవి. ప్రతి ఇంటికీ వెళ్లి, ఆప్యాయంగా పలకరించి, వారికి చదువుపై అవగాహన కల్పించి, పుస్తకాలను అందిస్తున్నది. వారు చదివిన తర్వాత ఆ పుస్తకాలను ఇతరులకు అందిస్తున్నది. ఎవరైనా పలానా పుస్తకాలు కావాలని ముందుగా చెబితే వాటిని తన లైబ్రరీ నుంచి తీసుకెళ్లి మరీ ఇస్తున్నది ఉమాదేవి.

ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటలకు ఆమె ప్రయాణం మొదలవుతుంది. ఇప్పటివరకు 220 ఇళ్లలో పుస్తకాలను అందించింది. ఉమాదేవి డిగ్రీ చదువుతుండగా వివాహమైంది. 20 ఏండ్లకు పైగా ట్యూషన్లు చెప్పింది. 18 ఏండ్ల క్రితం భర్త మరణించాడు. ఈమె చేస్తున్న అవిరళకృషికి ఎన్నో అవార్డులు వచ్చాయి. కేరళ మంత్రుల నుంచి సన్మానాలు కూడా అందుకున్నది ఉమాదేవి.


logo