బుధవారం 08 జూలై 2020
National - Jun 27, 2020 , 01:20:33

5 రాష్ర్టాల్లో 70% కరోనా కేసులు

5 రాష్ర్టాల్లో 70% కరోనా కేసులు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: దేశంలో కరోనా మహమ్మారి అంతకంతకూ ఉగ్రరూపం దాల్చుతున్నది. వరుసగా ఏడోరోజూ 14,000కుపైగా కేసులు నమోదయ్యాయి. శుక్రవారం నాటికి మొత్తం 4,90,401 లక్షల కేసులు నమోదుకాగా, 15,301 మంది ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా ఐదు రాష్ర్టాల్లో వైరస్‌ తీవ్రత అధికంగా ఉన్నది. మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌కరోనాతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నా యి. దేశంలో దాదాపు 70 శాతం కేసులు, 82 శాతం మరణాలు ఈ రాష్ర్టాల్లోనే నమోదవుతున్నాయి. మన రాష్ట్రం విషయానికి వస్తే, దేశంలోని మొత్తం కేసుల్లో రాష్ట్ర వాటా 2.2 శాతం కాగా, మరణాలు 0.01 శాతమే. 

చైనా కంటే మహారాష్ట్రలోనే ఎక్కువ..

కరోనాకి పుట్టినిల్లయిన చైనా కంటే మహారాష్ట్రలోనే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు 1.47 లక్షలకుపైగా కేసులు నమోదుకాగా, 6,931 మంది ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీలో 73,000కుపైగా కేసులు నమోదుకాగా, 2429 మంది మరణించారు. తమిళనాడు, గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌లోనూ పరిస్థితి ఇలాగే ఉన్నది. 

తెలంగాణలో తక్కువే..

కరోనాతో దేశంలో ఇప్పటివరకు 15,301 మంది మరణించారు. మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌లలో నమోదైన మరణాలు 12,635. ఇది దాదాపు 82 శాతానికి సమానం. తెలంగాణలో కరోనా వల్ల 237 మంది మరణించారు. దేశం మొత్తం మరణాల్లో ఇది 0.01 శాతానికి సమానం. దేశంలో నమోదవుతున్న మొత్తం కేసుల్లో తెలంగాణ వాటా 2.2 శాతం అని గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. మన రాష్ట్రంలో మరణాల రేటు తక్కువగా ఉండటంలో తెలంగాణ ప్రభుత్వ ముందుచూపే కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు. పకడ్బందీగా లాక్‌డౌన్‌ అమలు చేయడం నుంచి వైరస్‌ పట్ల ప్రజలను అప్రమత్తం చేయడం వరకు ప్రభుత్వయంత్రాంగం నిర్విరామంగా శ్రమించింది. కరోనా పేషెంట్లకు నాణ్యమైన చికిత్స అందించడంతో కోలుకుంటున్న వారి సంఖ్య పెరిగింది. క్రమంగా టెస్టుల సంఖ్యను పెంచుతూ, చికిత్సకు మరిన్ని బెడ్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. టిమ్స్‌ దవాఖాన కూడా అందుబాటులోకి రానుండటంతో పేషెంట్లకు మరింత నాణ్యమైన చికిత్స అందనుంది.logo