గురువారం 02 ఏప్రిల్ 2020
National - Mar 06, 2020 , 02:11:04

కాంగ్రెస్‌ ఎంపీల సస్పెన్షన్‌

కాంగ్రెస్‌ ఎంపీల సస్పెన్షన్‌
  • బడ్జెట్‌ సమావేశాలు ముగిసేవరకూ ఏడుగురిపై లోక్‌సభ స్పీకర్‌ వేటు

న్యూఢిల్లీ, మార్చి 5: సభ నియమావళిని ఉల్లంఘిస్తూ.. సమావేశాలను అడ్డుకుంటున్నారన్న కారణంతో ఏడుగురు కాంగ్రెస్‌ ఎంపీలను లోక్‌సభ స్పీకర్‌ గురువారం సస్పెండ్‌ చేశారు. బడ్జెట్‌ సమావేశాలు పూర్తయ్యేవరకు ఈ సస్పెన్షన్‌ అమల్లో ఉంటుందన్నారు. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె కుటుంబసభ్యులకు కరోనా వైరస్‌ వైద్య పరీక్షలు చేయాలంటూ (భారత్‌లో ఈ వైరస్‌ సోకిన వారిలో ఎక్కువగా ఇటలీకి చెందిన పర్యాటకులు ఉండటం.. సోనియాగాంధీ ఇటలీలో జన్మించిన నేపథ్యంలో) బీజేపీ మిత్రపక్షమైన రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్‌ పార్టీ ఎంపీ హనుమాన్‌ బెనివాల్‌ వ్యాఖ్యానించారని, ఆయన్ను వెంట నే సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌చేస్తూ.. కాంగ్రెస్‌ సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లారు. స్పీకర్‌ పోడియంపై ఉన్న పేపర్లను లాక్కొని చించేశారు. దీంతో కాంగ్రెస్‌ ఎంపీలు గౌరవ్‌ గొగోయ్‌, టీఎన్‌ ప్రతాపన్‌, డీన్‌ కురియాకోస్‌, మనిక్క ఠాగూర్‌, రాజ్‌మోహన్‌ ఉన్నిధన్‌, బెన్ని బెహనన్‌, గుర్జీత్‌సింగ్‌ ఆవ్‌జ్లాను స్పీకర్‌ స్థానంలో ఉన్న బీజేపీ ఎంపీ మీనాక్షిలేఖి సస్పెండ్‌ చేశారు. 


ఇది ప్రతీకార రాజకీయం 

స్పీకర్‌ నిర్ణయంపై కాంగ్రెస్‌ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇది మోదీ ప్రభుత్వ నిరంకుశ నిర్ణయానికి తార్కానమని, ప్రతీకార రాజకీయాలకు నిదర్శనమని ఆరోపించింది. లోక్‌సభలో కాంగ్రెస్‌ నాయకుడు అధిర్‌ రంజన్‌ చౌదరి మాట్లాడుతూ.. ఎంపీల సస్పెన్షన్‌ నిర్ణయం స్పీకర్‌ది కాదని, ప్రభుత్వానిదని ఆరోపించారు. కాంగ్రెస్‌ నేతలు ఎలాంటి తప్పు చేయలేదని, ఢిల్లీ హింసాకాండ గురించి గట్టిగా గళాన్ని వినిపిస్తున్న ప్రతిపక్షాన్ని బలహీనపరిచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. మరోవైపు, లోక్‌సభ స్పీకర్‌ స్థానానికి ఏ మాత్రం గౌరవం ఇవ్వకుండా పేపర్లను లాక్కొని చించేసిన ‘ఎంపీ’ సభ్యత్వాన్ని రద్దు చేయమని స్పీకర్‌కు విజ్ఞప్తి చేస్తామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి మీడియాతో అన్నారు. కాంగ్రెస్‌ ఎంపీ గౌరవ్‌ గొగోయ్‌ను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారని అధికార వర్గాలు తెలిపాయి. 


logo