బెంగాల్‌కు 684 కంపెనీల బలగాలు

153
బెంగాల్‌కు 684 కంపెనీల బలగాలు

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లో ఈ నెల 27న ఐదు జిల్లాల పరిధిలో జరిగే తొలి విడత ఎన్నికల కోసం 684 కంపెనీల బలగాలను మోహరించనున్నట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. మొదటి దశలో పురులియా, బంకురా, జార్‌గ్రామ్‌, పుర్బా మేదినిపూర్‌, పశ్చిమ మేదినిపూర్‌లోని 30 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతాయని ఈసీ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. జార్‌గ్రామ్‌ మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో బూత్‌కు 11 మంది చొప్పున పారామిలటరీ సిబ్బందితో భద్రత కల్పించాలని ఈసీ నిర్ణయించినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇంతకు ముందెన్నడూ జరిగిన ఎన్నికల్లో ఇంత మొత్తంలో బలగాలను మోహరించలేదని వెల్లడించారు. ఎన్నికలు జరిగే మిగతా జిల్లాల్లో బూత్‌కు ఆరుగురు సిబ్బంది ఉంటారన్నారు. ఎన్నికల కోసం 144 కేంద్ర బలగాల జార్‌గ్రామ్‌లో మోహరించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లా పరిధిలో ఉన్న మొత్తం 1,307 పోలింగ్‌ బూత్‌లన్నింటినీ నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించారు. పూర్బా మేదినిపూర్‌లో 148 కంపెనీలు, పశ్చిమ మేదినిపూర్లో 124 కంపెనీలు, అతితక్కువగా బంకురలో 83 కంపెనీలు మోహరించనున్నట్లు చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బెంగాల్‌లో వాతావరణం వేడెక్కింది. అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీ పార్టీల మధ్య పోటీ హోరాహోరీగా సాగుతోంది. ఈ క్రమంలో బెంగాల్‌లో దాడులు, ప్రతిదాడులూ సాధారణంగా మారాయి. ఇటీవల ఉత్తర 24 పరగణ జిల్లాలోని భట్‌పారాలోని జగత్దల్‌లోని బరాక్‌పూర్‌ ఎంపీ అర్జున్‌ సింగ్‌ నివాసానికి దగ్గరలోనూ బాంబులు పేలాయి. అధికార పార్టీకి చెందిన వారే దాడికి పాల్పడ్డారని బీజేపీ ఆరోపించింది.