ఆదివారం 23 ఫిబ్రవరి 2020
ఇదేం నాగరికం

ఇదేం నాగరికం

Feb 15, 2020 , 14:40:44
PRINT
ఇదేం నాగరికం
  • రుతుస్రావంతో వంటగదిలోకి రావద్దు, ఇతరులను తాకొద్దంటూ ఆంక్షలు
  • అతిక్రమించారంటూ 68 మంది విద్యార్థినులకు రుతుస్రావ పరీక్ష
  • గుజరాత్‌లోని ఓ మహిళా కళాశాలలో దారుణం

భుజ్‌, ఫిబ్రవరి 14: నాగరిక ప్రపంచంలో.. సభ్యసమాజం తలదించుకునే ఘటన ఇది. మహిళలు ఓవైపు ఆకాశమే హద్దుగా ఎదుగుతున్నా.. అనాగరికపు ‘రుతుస్రావ’ ఆంక్షలు ఇంకా వెంటాడుతున్న సందర్భమిది. చదువు నేర్పి.. విద్యార్థులను వివేకవంతులను చేసి.. పోటీ ప్రపంచంలోని అవకాశాలను అందిపుచ్చుకొనేలా తీర్చిదిద్దే కళాశాలలోనే విద్యార్థినులకు జరిగిన ఘోర అవమానమిది. డిజిటల్‌ యుగంలో 1500 మంది విద్యార్థినుల సాక్షిగా.. 68 మంది యువతులకు ‘రుతుస్రావ’ పరీక్ష జరిగింది. విజ్ఞానం నేర్పాల్సిన గురువులే ఈ దారుణానికి కర్త, కర్మ, క్రియగా వ్యవహరించడం మరోదారుణం. గుజరాత్‌లోని భుజ్‌లో జరిగిన ఈ దారుణం ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తున్నది. భుజ్‌లోని ప్రముఖ స్వామినారాయణ్‌ మందిర్‌ యాజమాన్యం ‘శ్రీ సహజానంద మహిళా విద్యాసంస్థ’ పేరుతో కళాశాల నిర్వహిస్తున్నది. ఇందులో దాదాపు 1500 మంది విద్యార్థినులు డిగ్రీ చదువుతున్నారు. వీరిలో 68 మంది గ్రామీణ ప్రాంత విద్యార్థినులు కాలేజీలో ఉన్న హాస్టల్‌లో వసతి పొందుతున్నారు. 


ఈ కాలేజీలోని విద్యార్థినులు రుతుస్రావ సమయంలో వంటగదిలోకి, ఆవరణలో ఉన్న ఆలయంలోకి వెళ్లకూడదని, కనీసం తోటి విద్యార్థినులను ముట్టుకోవద్దంటూ కఠిన ఆంక్షలు అమల్లో ఉన్నాయి. అయితే బుధవారం హాస్టల్‌కు చెందిన విద్యార్థినుల్లో కొందరు నిబంధనలు అతిక్రమించి వంటగదిలోకి వచ్చారని, తోటి విద్యార్థినులను తాకారంటూ వార్డెన్‌ ఆరోపించింది. ఈ విషయమై గురువారం కళాశాల ప్రిన్సిపాల్‌ రీటాకు ఫిర్యాదు చేసింది. దీంతో ప్రిన్సిపాల్‌ తరగతులు కొనసాగుతుండగానే.. 68 మంది హాస్టల్‌ విద్యార్థినులను బయటికి పిలిపించింది. వారిని మూత్రశాలల వద్దకు తీసుకెళ్లి వరుసలో నిల్చోబెట్టింది. హాస్టల్‌ వార్డెన్‌, కొందరు మహిళా అధ్యాపకులు కలిసి విద్యార్థులను ఒక్కొక్కరిగా వాష్‌రూమ్‌లోకి తీసుకెళ్లి వారి లోదుస్తులను విప్పాల్సిందిగా ఆదేశించారు. 


వాటిని పరిశీలించి రుతుస్రావం జరుగుతున్నదో లేదో నిర్ధారించి ఘోరంగా అవమానించారు. ‘మేము బుధవారం హాస్టల్‌లో ఉండగా వార్డెన్‌ అంజలీబెన్‌ ఇదే విషయమై గొడవ చేసింది. గురువారం మేము తరగతి గదిలో ఉండగా బయటికి పిలిపించి మరోసారి ఘోరంగా అవమానించారు’ అంటూ ఓ విద్యార్థిని తమకు జరిగిన దారుణాన్ని వివరించారు. ‘చాలా రోజులుగా మమ్మల్ని ఇలాగే వేధిస్తున్నారు. ఎవరికైనా ఫిర్యాదుచేస్తే చదువు మధ్యలో ఆపేస్తామని, మా తల్లిదండ్రులను పిలిపించి ఇంటికి పంపిస్తామని బెదిరిస్తున్నారు’ అని మరో విద్యార్థిని వాపోయింది. ఈ ఘటనపై నిజనిర్ధారణ కమిటీని వేసినట్టు ‘క్రాంతిగురు శ్యామ్‌జీ కృష్ణవర్మ కచ్‌ యూనివర్సిటీ’ ఇంచార్జి వీసీ డాక్టర్‌ దర్శన ఢోలకియా తెలిపారు. అయితే విద్యార్థుల సమ్మతితోనే ఇదంతా జరిగిందని, వారిని ఎవరూ వేధించలేదని చెప్పారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి వార్డెన్‌, ఇద్దరు అధ్యాపకులపై కేసు నమోదు చేసినట్లు పశ్చిమ కచ్‌ ఎస్పీ సౌరభ్‌ టోలంబియా పేర్కొన్నారు. గుజరాత్‌ రాష్ట్ర మహిళా కమిషన్‌ ఈ ఘటనను సుమోటోగా స్వీకరించింది.


logo