శుక్రవారం 10 ఏప్రిల్ 2020
National - Mar 22, 2020 , 00:26:03

విసురుతున్న పంజా

విసురుతున్న పంజా

-దేశంలో ఒక్కరోజే 65 కరోనా కేసులు నమోదు 

-283కి పెరిగిన బాధితుల సంఖ్య 

-ఇంకా ‘సమూహ వ్యాప్తి’ దశకు చేరలేదన్న ఐసీఎంఆర్‌ 

-దిగ్బంధం దిశగా పలు రాష్ర్టాలు 

న్యూఢిల్లీ/లక్నో/న్యూయార్క్‌: దేశంపై కరోనా పంజా విసురుతున్నది. శనివారం కొత్తగా 65 కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో కొత్తగా నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. దీంతో భారత్‌లో కరోనా బాధితుల సంఖ్య 283కు పెరిగినట్టు కేంద్రం తెలిపింది. వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు పలు రాష్ర్టాలు దిగ్బంధం దిశగా అడుగులు వేస్తున్నాయి. 

ఐసీఎంఆర్‌ కొత్త మార్గదర్శకాలు 

కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ఐసీఎంఆర్‌ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. తీవ్ర శ్వాసకోశ సమస్యలు, జ్వరం, దగ్గు వంటి లక్షణాలతో బాధపడుతూ దవాఖానల్లో చేరిన ప్రతి ఒక్కరికీ వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. కరోనా నిర్ధారణ అయిన వ్యక్తులతో సన్నిహితంగా మెలిగినవారిపై ఇప్పటికే నిఘా ఉంచుతుండగా.. ఇకపై వారికి ఐదోరోజు, 14వ రోజున పరీక్షలు నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్‌ ల్యాబ్‌లలోనూ కరోనా పరీక్షలు నిర్వహించాలని కేంద్రం ఆదేశించింది. దేశంలో మొదటి సామాజిక వ్యాప్తి కేసు!దేశంలో కరోనా ‘సమూహ వ్యాప్తి’ (స్టేజ్‌-3)స్థాయిలో లేదని ఐసీఎంఆర్‌ చెప్తున్నా.. పుణెలో 41 ఏండ్ల మహిళకు కరోనా వైరస్‌ సోకినట్టు ‘నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ’ తేల్చింది. ఆమె ఎలాంటి విదేశీ ప్రయాణాలు చేయలేదని, కరోనా రోగులను కలుసుకోలేదని పేర్కొన్నది. దీంతో దేశంలో మొదటి సమూహ వ్యాప్తి కేసు వెలుగులోకి వచ్చినట్టు భావిస్తున్నారు. 

  • అంతర్జాతీయ విమానాల రాకపోకలపై నిషేధం శనివారం అమల్లోకి  వచ్చింది. 
  • మహారాష్ట్రలోని నాసిక్‌ జిల్లాలో మద్యం అమ్మకాలపై నిషేధం విధించారు.  

వందకోట్ల మంది ఇండ్లకే పరిమితం

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచవ్యా ప్తంగా దాదాపు 100 కోట్ల మంది బయటకు కాలు పెట్టకుండా ఇండ్లలోనే ఉండిపోయారని తెలుస్తున్నది. వైరస్‌ వాప్తిని అడ్డుకోవడానికి పలు దేశాలు స్వీయ నిర్బంధాన్ని పాటిస్తున్నాయి. యవ్వనంలో ఉన్న వారికి కూడా కరోనాతో ప్రమాదమేనని డబ్లూహెచ్‌వో హెచ్చరించింది. వరుసగా మూడోరోజు శనివారం చైనాలో ఒక్క వైరస్‌ కేసు కూడా నమోదు కాలేదు.

కనిక ప్రకంపనలు.. రాష్ట్రపతి అన్ని కార్యక్రమాలు రద్దు !

బాధ్యత మరిచి ప్రవర్తించిన బాలీవుడ్‌ గాయని కనికాకపూర్‌ ప్రకంపనలు రాష్ట్రపతి వరకు తాకాయి. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తన కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకున్నారు. ఎంపీ దుష్యంత్‌ సింగ్‌ ఇటీవల రాష్ట్రపతి ఇచ్చిన విందుకు హాజరైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది. కనికాకపూర్‌కు కరోనా సోకడం, ఆమె ఇటీవల హాజరైన ఓ దావత్‌లో ఎంపీ దుష్యంత్‌ సింగ్‌ పాల్గొనడంతో కలకలం రేగిన సంగతి తెలిసిందే. మరోవైపు ఎంపీ దుష్యంత్‌ ఈ నెల 18న జరిగిన పార్లమెంట్‌ స్థాయీ సంఘం భేటీకి హాజరైన నేపథ్యంలో.. ఇందులో పాల్గొన్న అధికారులంతా స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలని వైమానిక మంత్రిత్వ శాఖ ఆదేశించింది. 


logo