బుధవారం 20 జనవరి 2021
National - Dec 31, 2020 , 16:41:39

ఉపాసన తల్లి శోభన అరుదైన రికార్డు.. సైకిల్ పై 642 కిలోమీటర్ల రైడ్..

ఉపాసన తల్లి శోభన అరుదైన రికార్డు.. సైకిల్ పై 642 కిలోమీటర్ల రైడ్..

హైదరాబాద్‌ : ఈ రోజుల్లో ఎక్కడికి వెళ్లాలన్నా కూడా కారు, బైకు అంటూ పరుగులు పెడుతుంటారు. కానీ అన్నింటి కంటే ఆరోగ్యకరమైన సైకిల్‌ను మాత్రం అందరు మరిచిపోయారు. సైక్లింగ్ చేస్తే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని వైద్యులు చెబుతుంటారు. కానీ దాన్ని చాలామంది పట్టించుకోరు. అయితే ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన వాళ్ల అమ్మ శోభన కామినేని అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు.

హైదరాబాద్‌ మసాబ్ ట్యాంక్ నుంచి చెన్నైలోని బిషప్ గార్డెన్ వరకు సైకిల్ తొక్కుకుంటూ వెళ్లారు. ఆరు రోజుల్లో ఈమె ఈ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. ఇదే విషయాన్ని తన ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది ఉపాసన. 60 ఏండ్ల వయసులో తన అమ్మ శోభన సృష్టించిన రికార్డు గురించి గర్వంగా చెబుతుంది ఈమె. తన తల్లిని చూసి చాలా గర్వపడుతున్నానని.. అలాగే ఆమె నుంచి ఎంతో స్ఫూర్తి పొందుతున్నా అని ట్వీట్ చేసింది ఉపాసన. సైకిల్ తొక్కితే వచ్చే ఆరోగ్యం ముందు ఏం చేసిన కూడా రాదు అని మన పెద్దవాళ్లు చెబుతుంటారు.

ఇప్పుడు మా అమ్మ కూడా అదే చేసింది అంటూ వీడియో పోస్ట్ చేసింది. 642 కిలోమీటర్లు ఆ రోజుల్లో సైకిల్ తొక్కుకుంటూ హైదరాబాద్ టు చెన్నై చేరుకొంది శోభన. ఆమెతో పాటు మరికొందరు కూడా సైక్లింగ్ చేశారు. అయితే 60 ఏండ్ల వయసులో ఇంత ఉత్సాహంగా సైకిల్ తొక్కడం అనేది చిన్న విషయం కాదు. ఈ విషయంలో తన తల్లి నుంచి ఎంతో నేర్చుకోవాలి అంటుంది ఉపాసన. సైకిల్‌పై దేశం అంతా తిరగడం తన తల్లికి ఎంతో ఇష్టమని చెబుతుంది.

అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్మన్ హోదాలో ఉండి ఇంత సింపుల్‌గా ఉండటం అనేది చిన్న విషయం కాదు. కానీ ఉపాసన తల్లి అది చేసి చూపించింది. శోభన ఉత్సాహం చూస్తుంటే త్వరలోనే దేశం అంతా సైకిల్‌పై చుట్టేలా కనిపిస్తున్నారు. ఏదేమైనా కూడా ఈమె సృష్టించిన ఈ రికార్డు మాత్రం యువతకు ఆదర్శంగా నిలిచి పోతుంది అంటున్నారు నెటిజన్లు.


logo