శుక్రవారం 23 అక్టోబర్ 2020
National - Oct 02, 2020 , 02:02:52

8 శాతం మంది రోగులతోనే 60 శాతం కరోనా కేసులు

8 శాతం మంది రోగులతోనే 60  శాతం కరోనా కేసులు

  • దేశంలో వారివల్లే వైరస్‌ విజృంభణ 
  • సీడీడీఈపీ సర్వేలో వెల్లడి
  • బడులు తెరిచిన పిల్లలను పంపబోమని 71శాతం మంది వెల్లడి 
  • రద్దయిన విమానాల డబ్బులు తిరిగి ఇచ్చేయండి: సుప్రీంకోర్టు 

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 1: దేశంలో కరోనా వైరస్‌ కట్టుదాటడానికి కేవలం 8 శాతం మంది కరోనా బాధితులే కారణం అని తేలింది. 60 శాతం కేసులు ఈ 8 శాతం రోగుల కారణంగానే నమోదయ్యాయని వెల్లడైంది. సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ డైనమిక్స్‌, ఎకనమిక్స్‌ అండ్‌ పాలసీ (సీడీడీఈపీ) అనే సంస్థ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన సర్వేలో ఈ వివరాలు తెలిశాయి. సాధారణంగా కరోనా రోగి నుంచి వారికి సన్నిహితంగా మెలిగే కుటుంబసభ్యులు, మిత్రులకు వైరస్‌ వ్యాపిస్తున్నదని ఇప్పటివరకు భావిస్తూ వస్తున్నారు. కానీ ఎలాంటి సంబంధం లేని రోగుల ద్వారానే వైరస్‌ వేగంగా ఇతరులకు సోకిందని తాజా సర్వే తేల్చింది. 71 శాతం మంది కరోనా రోగులలో.. వారి ద్వారా వారి సన్నిహితులకు, కుటుంబసభ్యులకు వైరస్‌ వ్యాపించలేదని తెలిపింది. అంటే.. కరోనా రోగుల్లో అత్యధికశాతం మంది వైరస్‌ వాహకులుగా పని చేయలేదు. వ్యాధి ఉన్న విషయం తెలియక, తెలిసినా నిర్లక్ష్యంగా బహిరంగ ప్రదేశాల్లో తిరిగిన వ్యక్తులే వైరస్‌ను పెద్ద ఎత్తున వ్యాపింపజేశారని వెల్లడైంది. భారత్‌లో కరోనా మృతుల్లో ఎక్కువమంది 40-69 ఏండ్ల మధ్యవయస్కులే ఉన్నారని సీడీడీఈపీ డైరెక్టర్‌ రమణ లక్ష్మీనారాయణ తెలిపారు.

సర్వే వివరాలు

  • n ఆగస్టు 1నుంచి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లలో కరోనా రోగుల సన్నిహితుల్లో దాదాపు 30లక్షల మంది వివరాలు సేకరించారు. 
  • n చైనా, యూరప్‌, అమెరికాల నుంచి వచ్చిన వారి ద్వారానే ఈ రాష్ర్టాల్లోకి కరోనా ప్రవేశించిందని తేలింది.  
  • n కరోనా రోగుల్లో 71 శాతం మంది వాహకులుగా పని చేయలేదు. వారి ద్వారా వారికి సన్నిహితంగా మెలిగినవారికి కరోనా సోకలేదు.
  • n బస్సులు, ఇతర రవాణా సాధనాల్లో చాలాసమయం కలిసి ప్రయాణించటం ద్వారానే అత్యధికమందికి వైరస్‌ సోకింది.
  • n ఈ రెండు రాష్ర్టాల్లో ఒక్కో కరోనా రోగి సగటున 80మందితో సన్నిహితంగా మెలిగినట్టు గుర్తించారు.
  • n కుటుంబసభ్యులు, సమవయస్కులకు వైరస్‌ వ్యాప్తిచేసిన వారిలో 14 ఏండ్లలోపువారే అధికంగా ఉన్నారు. పాఠశాలలు మూతపడినప్పటికీ పిల్లల్లో వైరస్‌ వ్యాప్తి అధికంగానే ఉన్నది.


logo