మంగళవారం 07 జూలై 2020
National - Jun 22, 2020 , 12:39:17

ఇంతకన్నా దారుణం మరోటి ఉంటుందా?

ఇంతకన్నా దారుణం మరోటి ఉంటుందా?

లక్నో: ముజఫ్పర్‌పూర్‌ ఆశ్రమం ఘటన మరిచిపోకముందే మరో దారుణం వెలుగులోకి వచ్చింది. అనాథలు ఉండే ఆశ్రమంలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడానికి వచ్చిన అధికారులకు విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. ఈ ఆశ్రమం ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తుండటం విశేషం. యావత్‌ ప్రపంచాన్ని కరోనా వైరస్‌ వణికిస్తుంటే.. అనాథ బాలికలను జిత్తులమారి నక్కలు భయపెట్టి వశపర్చుకొని గర్భవతులను చేస్తున్నాయి. గతంలో ఇలాంటి దారుణాలు బయటపడినప్పటికీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొంటున్న దాఖలాలు ఏమాత్రం కనిపించడం లేదు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్‌ నగరం కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల నమోదులో 400 సంఖ్యను దాటి రెండో స్థానంలో ఉన్నది. దీన్ని దృష్టిలో పెట్టుకొన్న ప్రభుత్వం.. విరివిగా కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు జరుపాలని నిర్ణయించింది. ఈ మేరకు కాన్పూర్‌ నగరంలోని ప్రభుత్వ షెల్టర్‌ హోంలో పరీక్షలు నిర్వహించగా 57 మందికి పాజిటివ్‌గా తేలింది. అంతకు మించి విస్తుపోయే విషయం మరోటి ఏమిటంటే.. వీరిలో ఐదుగురు గర్భవతులు కావడం. నెగెటివ్‌ ఫలితం వచ్చిన మరో ఇద్దరు బాలికలు కూడా గర్భవతులుగా అధికారులు గుర్తించారు. మొత్తం 57 మంది బాలికలను చికిత్స కోసం కొవిడ్ -19 దవాఖానల తరలించగా, అధికారులు షెల్టర్‌ హోంకు సీల్‌ వేశారు.

ఇలాఉండగా, బాలికలు షెల్టర్‌ హోంకు రాకముందే గర్భవతులు అని కాన్పూర్ జిల్లా మేజిస్ట్రేట్ బ్రహ్మ దేవ్ రామ్ తివారీ తెలిపారు. కోవిడ్ -19 పాజిటివ్‌గా గుర్తించిన ఐదుగురు గర్భిణి బాలికలను ఆగ్రా, ఎటా, కన్నౌజ్, ఫిరోజాబాద్, కాన్పూర్ శిశు సంక్షేమ కమిటీలు పోక్సో చట్టం క్రింద ఆధీనంలోకి తీసుకొని గత ఏడాది డిసెంబర్‌ నెలలో ఇక్కడికి పంపినట్లు ఆయన చెప్పారు. ఇక్కడికి వచ్చే ముందే బాలికలు గర్భవతి అని జిల్లా సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్ దినేష్ కుమార్ కూడా పేర్కొనడం గమనార్హం.

ఈ నెల 12 న యాదృచ్ఛిక నమూనా పరీక్ష తర్వాత కేసుల సమూహం బయటపడింది. ఒక కేసు బయటపడిన తరువాత షెల్టర్‌ హోంలోని మొత్తం 171 మందిని అధికారులు పరీక్షించారు. కాగా, 15 నుంచి 17 సంవత్సరాల మధ్య వయసున్న 57 మందికి కరోనా వైరస్‌ సోకినట్లు గుర్తించారు. వీరిలో ఒకరు సిబ్బంది కూడా ఉన్నారు.

ఇలాఉండగా, షెల్టర్‌ హోం ఘటన రాష్ట్రంలో రాజకీయ బురద జల్లుకొనే ఆటను ప్రేరేపించింది. షెల్టర్‌ హోంలకు వచ్చే బాలికలపై ఇలా లైంగికదాడులకు పాల్పడటం గురించి వాస్తవాలను రాష్ట్ర ప్రభుత్వం అణిచివేస్తుందని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా ఆరోపించారు. ఉత్తరప్రదేశ్ డియోరియాలో ఇలాంటి కేసు బయటపడిందని, దర్యాప్తు పేరిట ప్రతిదీ తొక్కిపెట్టాలని చూస్తున్నారని, కానీ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న చైల్డ్ షెల్టర్ ఇళ్లలో చాలా అమానవీయ సంఘటనలు జరుగుతున్నాయంటూ ప్రియాంకా వాద్రా ట్విట్టర్‌లో ఆరోపించారు. 

ఉత్తర ప్రదేశ్‌లో ఇప్పటివరకు 16,594 కరోనావైరస్ కేసులు నమోదు కాగా.. 507 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు చెబుతున్నాయి.


logo