గురువారం 28 మే 2020
National - May 17, 2020 , 17:03:29

560 మంది వలస కార్మికులకు పాజిటివ్‌

560 మంది వలస కార్మికులకు పాజిటివ్‌

పాట్నా: పొట్ట చేత పట్టుకొని వివిధ ప్రాంతాలకు తరలివెళ్లిన వలస కార్మికులపై కరోనా వైరస్‌ పంజా విసురుతున్నది. సొంతూరులో కలో గంజో తాగి బ్రతుకాలన్న ధ్యాసతో ఏదో ఒక రకంగా ఇంటికి పయనమయ్యారు. చాలా మంది గుంపులుగా గుంపులుగా ట్రక్కుల్లో వెళ్తుండటం వలన వీరిలో చాలా మంది కరోనా పాజిటివ్‌కు గురవుతున్నారు. కొవిడ్‌-19 లక్షణాలు ఎలా ఉంటాయో కూడా తెలియని ఈ అమాయక పల్లె ప్రజలు.. సొంత రాష్ట్రాలకు చేరుకోగానే అక్కడి ప్రభుత్వాలు వీరికి కరోనా నిర్ధారణ పరీక్షలు జరిపిన తర్వాతనే వారివారి ఇండ్లకు పంపిస్తున్నారు. 

ఇలా బీహార్‌లోని వివిధ రాష్ట్రాలకు చెందిన దాదాపు 10,385 మంది వలస కార్మికులు ఉన్నారు. వీరికి ప్రభుత్వం వివిధ దవాఖానల్లో కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. ఇప్పటివరకు 560 మందికి పాజిటివ్‌గా తేలింది. వీరి నుంచి మరింత మందికి సోకకుండా ఉండేందుకు వీరిని ప్రభుత్వ క్వారంటైన్‌కు తరలించారు. 560 మందిలో 172 మంది ఢిల్లీకి చెందినవారు, 123 మంది మహారాష్ట్ర, 26 మంది పశ్చిమ బెంగాల్‌ వాసులని బీహార్‌ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ నివేదిక వెల్లడించింది. మరో 2,746 శాంపిల్స్‌ నివేదికలు అందాల్సి ఉన్నదని ఆ నివేదికలో పేర్కొన్నారు.


logo