సోమవారం 01 జూన్ 2020
National - May 16, 2020 , 15:25:49

విదేశాల్లో చిక్కుబడ్డ 56 మంది గర్భిణీ నర్సులు

విదేశాల్లో చిక్కుబడ్డ 56 మంది గర్భిణీ నర్సులు

న్యూఢిల్లీ: భారత్‌కు చెందిన 56 మంది గర్భిణీ నర్సులు విదేశాల్లో చిక్కుకుపోయారు. అయితే తమను స్వదేశానికి తరలించేలా దేశంలోని సంబంధిత మంత్రిత్వ శాఖలను ఆదేశించాలని వారు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. నర్సుల తరఫున యునైటెడ్‌ నేషన్స్‌ ఆర్గనైజేషన్‌ అనే సంస్థ ఈ పిటిషన్‌ దాఖలు చేసింది. కేఆర్‌ సుభాష్‌ చంద్రన్‌ అనే న్యాయవాది ద్వారా పిటిషన్‌ వేయించింది. ఆ పిటిషన్‌లో నర్సులు.. తామంతా ఇక్కడ తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నామని, ఇక్కడి ప్రభుత్వాలు ఫ్యామిలీ స్టేటస్‌ వీసాలు ఇవ్వకపోవడంతో కుటుంబాలతో కాకుండా ఒంటరిగా ఉండాల్సి వస్తున్నదని, ప్రస్తుత పరిస్థితుల్లో తమకు మానసికంగా, సామాజికంగా సపోర్టు అవసరమని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన ఢిల్లీ హైకోర్టు ఈ నెల 18న విచారణ జరుపనున్నట్లు తెలిపింది. 

కాగా విదేశాల్లో చిక్కుకున్న ఈ 56 మంది గర్భిణీ నర్సులలో 55 మంది సౌదీ అరేబియాలో, మరొకరు కువైట్‌లో ఉన్నారు. వీరంతా అక్కడ హెల్త్‌కేర్‌ వర్కర్స్‌గా పనిచేశారు. 36 వారాలు నిండిన గర్భిణిలకు విమాన ప్రయాణానికి అనుమతి లేదన్న ఎయిర్‌లైన్స్‌ పాలసీ కారణంగా వారు వందేభారత్‌మిషన్‌ మొదటి విడతలో భారత్‌కు చేరుకోలేకపోయారు. దీంతో రెండో విడతలోనైనా వారికి ప్రత్యేక చార్టర్డ్‌ విమానం ఏర్పాటు చేసి స్వదేశానికి తీసుకురావాలని పిటిషనర్‌ కోరారు.


logo