బుధవారం 08 జూలై 2020
National - Jun 15, 2020 , 06:45:35

మూడు దేశాల నుంచి భారత్‌ చేరుకున్న 541 మంది

మూడు దేశాల నుంచి భారత్‌ చేరుకున్న 541 మంది

న్యూఢిల్లీ: వందేభారత్‌ మిషన్‌లో భాగంగా శాన్‌ఫ్రాన్సిస్కో, ఖతార్‌, టొరంటో నుంచి మూడు ఎయిర్‌ ఇండియా ప్రత్యేక విమానాల్లో మొత్తం 541 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు. లాక్‌డౌన్‌తో ఖతార్‌లో చిక్కుకుపోయిన 178 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు. వీరంతా కేరళలోని కన్నూరుకు చెందినవారు. వారిలో ఆరుగురు చిన్నారులు కూడా ఉన్నారు. ఖతార్‌లోని దోహా నుంచి ఇప్పటివరకు 31 ప్రత్యేక విమానాలు భారత్‌కు వచ్చాయి. వాటిలో 5262 మందిని స్వదేశానికి తీసుకువచ్చారు. ఇందులో 151 మంది చిన్నారులు ఉన్నారు.    

అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో చిక్కుకుపోయిన 226 మంది భారతీయులతో ఎయిర్‌ ఇండియా ప్రత్యేక విమానం న్యూఢిల్లీ చేరుకున్నది. ఈ విమానం ఢిల్లీ మీదుగా హైదరాబాద్‌ వచ్చింది. శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి ఇప్పటివరకు ఏడు విమానాల్లో భారతీయులను తరలించారు. కెనడాలోని టొరంటో నుంచి 137 మంది భారతీయులు న్యూఢిల్లీకి చేరుకున్నారు.   

కరోనా వైరస్‌ విస్తరించకుండా లాక్‌డౌన్‌తో విధించడంతో విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం వందేభారత్‌ మిషన్‌ను మే 7న ప్రారంభించింది. రెండో దశ వందేభారత్‌ మిషన్‌ మే 16 ప్రారంభంకాగా, ప్రస్తుతం మూడో దశ కొనసాగుతున్నది. జూన్‌ 16న ప్రారంభమైన వందేభారత్‌ మూడో దశ ఈ నెలాఖరు వరకు కొనసాగనుంది. 

ఇప్పటివరకు 1,65,375 మందిని వివిధ దేశాల నుంచి భారత ప్రభుత్వం ప్రత్యేక విమానాల్లో స్వదేశానికి తరలించింది. ఇందులో 29,034 మంది వలస కార్మికులు కూడా ఉన్నారని విదేశాంగ శాఖ ప్రకటించింది. 


logo