ఆదివారం 29 నవంబర్ 2020
National - Nov 04, 2020 , 01:59:53

రెండో విడుతలో 54.64%

రెండో విడుతలో 54.64%

  • బీహార్‌లో ప్రశాంతంగా రెండో దశ పోలింగ్‌
  • 10 రాష్ర్టాల్లోని 54 స్థానాలకు ముగిసిన బైపోల్స్‌

న్యూఢిల్లీ: బీహార్‌లో రెండో విడుత అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 94 నియోజకవర్గాలకు మంగళవారం నిర్వహించిన ఎన్నికల్లో 54.64 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. పూర్తి గణాంకాలు ఇంకా అందాల్సి ఉన్నందున ఓటింగ్‌ శాతం మరింత పెరిగే అవకాశం ఉన్నదని తెలిపింది. 2015లో ఈ నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో 55.35 శాతం పోలింగ్‌ నమోదైనట్లు వివరించింది. మహాకూటమి సీఎం అభ్యర్థి, ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్‌ సహా పలువురు ప్రముఖులు ఈ విడుత బరిలో ఉన్నారు. మూడో విడుతలో ఈ నెల 7న 78 స్థానాలకు ఓటింగ్‌ జరుగనుంది. 

ఉప ఎన్నికల్లో భారీ పోలింగ్‌

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలతోపాటే 10 రాష్ర్టాల్లోని 54 అసెంబ్లీ స్థానాలకు మంగళవారం ఉప ఎన్నికలు ముగిశాయి. తెలంగాణలోని 

దుబ్బాక నియోజకవర్గంతోపాటు, మధ్యప్రదేశ్‌లో 28, గుజరాత్‌లో 8, యూపీలో 7, ఒడిశా, నాగాలాండ్‌, కర్ణాటక, జార్ఖండ్‌లలో రెండేసి చొప్పున, ఛత్తీస్‌గఢ్‌, హర్యానాలలో ఒక్కో స్థానంలో ఉప ఎన్నికలు నిర్వహించారు. కరోనా భయాందోళనలు ఉన్నప్పటికీ ఈ ఉప ఎన్నికల్లో ఓ మోస్తరు నుంచి భారీ పోలింగ్‌ నమోదైంది. నాగాలాండ్‌లోని పుంగ్రో-కిఫిరే నియోజకవర్గంలో అత్యధికంగా 89.8 శాతం, కర్ణాటకలోని రాజేశ్వరినగర్‌ స్థానంలో  అత్యల్పంగా 45.24 శాతం పోలిం గ్‌ రికార్డయింది. మిగిలిన స్థానాల్లో దాదాపు 50 శాతానికిపైగానే ఓటింగ్‌ నమోదైంది. 

ఈ నెల 10న వెలువడే బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో తేజస్వీ యాదవ్‌ విమర్శకుల నోళ్లు మూతపడతాయి. యువతకు 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని తేజస్వీ ఇచ్చిన హామీతో వణికిపోతున్నందువల్లే ఎన్డీఏ నేతలు ఆయనపై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు.

- కాంగ్రెస్‌ నేత శతృఘ్నసిన్హా