శనివారం 11 జూలై 2020
National - May 26, 2020 , 03:02:24

రెండు నెలల తర్వాత దేశీయ ప్రయాణాల పునరుద్ధరణ

రెండు నెలల తర్వాత దేశీయ ప్రయాణాల పునరుద్ధరణ

  • ఎగిరిన విమానాలు
  • 532 సోమవారం నడిచిన విమాన సర్వీసులు
  • 39,231 మొత్తం ప్రయాణికులు
  • పలు రాష్ర్టాల నిరాకరణతో 630 సర్వీసులు రద్దు
  • ముందస్తు సమాచారం లేక ఇబ్బందులు పడిన ప్రయాణికులు

న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో విధించిన దేశవ్యాప్త లాక్‌డౌన్‌ వల్ల సుమారు రెండు నెలలుగా నిలిచిపోయిన దేశీయ విమానాలు ఎట్టకేలకు సోమవారం ఎగిరాయి. విమాన చార్జీలపై కేంద్రం పరిమితి, ప్రయాణాలపై మార్గదర్శకాల నేపథ్యంలో మూడోవంతు సర్వీసులను విమానయాన సంస్థలు పునరుద్ధరించాయి. దీంతో దేశంలోని చాలా ఎయిర్‌పోర్టుల వద్ద సోమవారం సందడి నెలకొన్నది. నిబంధనల ప్రకారం ప్రయాణికులకు థర్మల్‌ స్క్రీనింగ్‌ నిర్వహించారు. దీంతో ఎయిర్‌పోర్టుల వద్ద భారీ క్యూలు కనిపించాయి.

ఆరోగ్యసేతు యాప్‌లో స్టేటస్‌ తనిఖీ, వెబ్‌ చెక్‌ ఇన్‌ తర్వాత ప్రయాణికులను లోనికి అనుమతించారు. రక్షణ పరికరాల కిట్లను ధరించిన విమాన సిబ్బంది వారికి స్వాగతం పలికారు. సోమవారం ఉదయం 4.45 గంటలకు ఢిల్లీ నుంచి పుణెకు తొలి విమానం టేకాఫ్‌ అయ్యింది. కాగా క్వారంటైన్‌ నిబంధనలను ఖరారు చేయలేకపోవడంతో పలు రాష్ర్టాలు విమానాశ్రయాలను తెరిచేందుకు నిరాకరించాయి. దీంతో దేశవ్యాప్తంగా సుమారు 630 విమాన సర్వీసులు రద్దుకాగా, కొన్ని షెడ్యూళ్లు మారాయి. అయితే ప్రయాణికులకు ముందస్తు సమాచారం లేకపోవడంతో వ్యయప్రయాసలు పడి ఎయిర్‌పోర్టులకు చేరుకున్నవారంతా ఇబ్బందిపడ్డారు. ఢిల్లీ, ముంబై సహా పలు విమానాశ్రయాల్లో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో మంగళవారం నుంచి పశ్చిమ బెంగాల్‌లో ఈ నెల 28 నుంచి విమాన సర్వీసులను క్రమంగా పునరుద్ధరించనున్నారు. 

నేను మంత్రిని.. నాకు క్వారంటైన్‌ వర్తించదు.. 

కరోనా కేసులు ఎక్కువగా ఉన్న మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్‌, తమిళనాడు వంటి రాష్ర్టాల నుంచి వచ్చే దేశీయ విమాన ప్రయాణికులు ఏడు రోజులు హోటల్‌ క్వారంటైన్‌లో, మరో ఏడు రోజులు హోమ్‌ క్వారంటైన్‌లో ఉండాలని కర్ణాటక ప్రభుత్వం ముందే స్పష్టం చేసింది. అయితే కొన్ని మినహాయింపులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో నెగిటివ్‌ పరీక్ష రిపోర్టుతో సోమవారం ఢిల్లీ నుంచి బెంగళూరు చేరుకున్న కేంద్ర మంత్రి సదాశివ గౌడ క్వారంటైన్‌ నుంచి తనకు మినహాయింపు ఉందని చెప్పారు. తాను క్వారంటైన్‌లో ఉంటే మందుల సరఫరా వ్యవహారాలు ఎవరు చూస్తారని ఆయన ప్రశ్నించారు. 

పౌరుల ఆరోగ్యం గురించి ఆలోచించండి.. 

విమానయాన సంస్థల పట్లగాక, పౌరుల ఆరోగ్యం గురించి ప్రభుత్వం ఆలోచించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశాలకు తరలించే ఎయిర్‌ ఇండియా విమానాల్లో మిడిల్‌ సీటును ఖాళీగా ఉంచకపోవడంపై బాంబే హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేయగా, ఆ సంస్థతోపాటు కేంద్రం సుప్రీంకోర్టులో సవాల్‌ చేశాయి. ఈద్‌ సందర్భంగా సోమవారం సెలవు అయినప్పటికీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బోబ్డే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ జరిపి ఈ మేరకు వ్యాఖ్యానించింది. జూన్‌ 6 వరకు మిడిల్‌ సీటు భర్తీకి అవకాశమిచ్చిన సుప్రీంకోర్టు, ఆ తర్వాత నుంచి బాంబే హైకోర్టు ఆదేశాలు పాటించాలని పేర్కొంది. జూన్‌ 2న లేదా ఆ లోపు కేంద్రం, ఎయిర్‌ ఇండియా వాదనలు విని, మధ్యంతర తీర్పు ఇవ్వాలని బాంబే హైకోర్టుకు సూచించింది. logo